Literature Jan 2021

సెగు – మరియసె కొండె

అది 19 వ శతాబ్దం. మొదటిసారిగా తన ఖండాంతరాల ఆవల ఉద్భవించిన శక్తుల ధాటికి ఆఫ్రికా ఖండం ప్రభావితం చేయబడుతున్న శతాబ్దం. సాంప్రదాయ సంస్కృతి, జీవన శైలి, మతం, కుటుంబ నిర్మాణం లాంటి అన్ని వ్యవస్థలు ఈ ఆటుపోట్లలో చిక్కుకొని తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటున్న సందర్భాన్ని రచయిత ఆవిష్కరిస్తారు., తింబక్తు మాలి, సూడాన్ మధ్య ప్రాంతాల్లో ఒక భాగాన్ని సెగు అని పిలుచుకుంటారు. ఇక్కడ యొరోబా, బంబారా, ఆషాంతి తెగల మధ్య జరిగిన సంఘర్షణని ఈ నవలలో మనం చూడవచ్చు.

అలెక్స్ హేలీ, Roots, Chinua Achebe, Things fall apart లాంటి నవలలు ఆఫ్రికా జీవితాన్ని పాఠకులకు ఆవిష్కరించిన తీరు అద్భుతం. ముఖ్యంగా ఒక ఆధిపత్య ధోరణి, లేదా అహంకారంతో ‘ఆటవిక లేదా అనాగరిక’ అని చిత్రించబడిన సమాజంలోని ఔన్నత్యాన్ని, లాలిత్యాన్ని, సహ్రుదయతను ప్రపంచానికి తెలియజేసిన నవలలు అవి. ఈ నవలల స్థాయికి తగ్గని రీతిలో ‘సెగు’ని రచయిత్రి తీర్చిదిద్దారు.

మధ్య ప్రాచ్య దేశాల నుంచి, ఇస్లాం ఈ గిరిజన సమాజంలో అప్పుడే చొచ్చుకొని వస్తోంది. పూర్వికులను, మత పెద్దలను, తెగ నాయకులను పూజించే సంప్రదాయాలను తెగుడుతోంది. వారందరికంటే అల్లాను (ఈ జగత్తుకి ఒకడే దేవుడు) ఆయన్ను ప్రార్ధించమంటోంది. దేశిక పెద్ద కొడుకు టికోరో ఈ మతానికి ఆకర్షితుడు అవుతాడు. తన సమాజంలోని కట్టుబాట్లు ఇస్లాంలోని కఠిన నియమాలకు మధ్య వైరుద్యం అతనిలో పలు సంఘర్షణలకు దారి తీస్తుంది. వేటకు వెళ్ళిన సందర్భంలో దేశికా రెండో కొడుకు నబా బానిస వ్యాపారులకు చిక్కుతాడు. వారితో బాటు అతను దేశాలు దాటి బ్రెజిల్ చేరుకుంటాడు. అక్కడ క్రైస్తవం స్వీకరిస్తాడు. కానీ అపనమ్మకం, జాత్యహంకారంతో కూడిన యజమానుల క్రౌర్యంలో హింసించి చంపబడతాడు. దేశికకు ఉంపుడు గత్తె ద్వారా పుట్టిన సిగా, తోళ్ళ వ్యాపారంలోని మెళకువలు నేర్చుకొని తిరిగివచ్చి ఊరిలో వ్యాపారం పెడతాడు. మరొక కొడుకు మలోబాలి యోధుడిగా పోరాట బాటను ఎంచుకొని యుద్దాలలో తలపడతాడు. ఆషాంతి సామ్రాజ్యంలో మెరుపు దాడులతో అలజడి సృష్టిస్తాడు.

నవలలో అంతర్లీనంగా అనేక ప్రశ్నలను, సమస్యలను రచయిత్రి సృజిస్తారు. సామ్రాజ్యవాదం, జాత్యహంకారం, వివక్ష, బానిసవిధానం లాంటి ప్రశ్నలన్నీ నవలలో అంతర్భాగంగా ఉన్నాయి. ఆఫ్రికా సమాజం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు బాహ్య నాగరికతలు, మతాలే జవాబులు చూపిస్తాయా? చారిత్రక ఘట్టాల నేపథ్యంలో తుడిచిపెట్టుకుపోయిన ఆఫ్రికా గిరిజన ప్రవృత్తి, జీవనవిధానం బలహీనమైనదా? దీనిని అధిగమించి ఆక్రమించిన ప్రాచ్య సంస్కృతి మెరుగైనదా? గొప్ప సాహిత్యంలో పాఠకుల స్వీయ విశ్లేషణ కోసం నవలలో అంతర్భాగంగా, మౌలికమైన ప్రశ్నలను, రచయిత సృజించాల్సి ఉంటుంది. అలాంటి ప్రయత్నాన్ని మరియసె కొండె పతాక స్థాయిలో విస్తృత రీతిలో చేశారు.

యొరోబా, బంబారా జీవనశైలిలో సామూహిక జీవితం ఉంది. సంపదను అందరితో పంచుకొనే పద్ధతి ఉంది. ప్రకృతిని, చెట్లను ప్రేమించే తత్వం ఉంది. ఆడ, మగ మధ్య సమానత్వం ఉన్నది. సమున్నతమైన, పరిపుష్టమైన ఈ జీవన విధానాన్ని కేవలం ‘Might is Right‘ అనే ఆయుధంతో కకావికలం చేసిన సజీవచిత్రమే ‘సెగు’ దేశిక కుటుంబంలోని అనేక సంఘటనలు ఈ సంఘర్షణను కళ్ళకు కడతాయి.

సెగు, సమాజంలోని పరిస్థితులు, సంఘటనలు, వాస్తవికతకు సారుప్యంగా (Realistic) ఛిత్రీకరించడం రచయిత్రి అద్భుత విజయం. చరిత్ర, ఇతిహాసం లోకి మారే సంఘటనలను, చారిత్రక ఘట్టాలను వైవిద్యభరితంగా, పరిశోధనతో, కల్పనతో కలిపి సృష్టించిన కావ్యమే సెగు. దేశిక కుటుంబం లోని వ్యక్తులను, వారి జీవన గమనం ఆఫ్రికా ఖండంలో జరిగిన ఆటుపోట్లకు చిహ్నాలుగా మనం చూడవచ్చు.

Read this novel on the recommendation of Balaram from Analpa books picking it up in the Vijayawada book fair.A revelation for me: the sweeping canvas and the fascinating narrative.

Share Your Comments

I would love to hear your thoughts.