Interests Feb 11, 2021

ఘనాఘన సుందరా

ఘంటసాల గారి గురించి ఏమని చెప్పాలి. ఆయన కంఠంలో ఎన్ని భావాలు. ఆయన గాత్రంలో ఎన్ని పార్శ్వాలు! ఆయన సంగీతంలో ఎన్ని సుమధురోహాలు! పాతాళభైరవిలో ఎంత ఘాటు ప్రేమయో పాటకు అన్ని కాలాల ప్రణయగీతాలలో మొదటి స్థానం యిచ్చే ఎంతోమంది సంగీత ప్రియులు ఉన్నారు. చందమామచేత చల్లగా మనవి చేయించే పాటలో ‘సందెవేళసుందరాంగి’ పదప్రాసలో ఘంటసాల వారు ఎంత అందమైన భావాలు పలికిస్తారో. ‘నా చందమామ అందాల భామ’ పాటలో ఉద్విగ్న, అనిశ్చిత భావాలకు ఘంటసాల మాస్టారు పలికించే తీరు మరపురానిది, మరువలేనిది. యిలా ఒకటి, రెండా రాసుకొంటూ పోతే కొన్ని వేల పేజీలు రాయాల్సి వస్తుంది. భక్తిపాటలు, (శేష శైలావాసా) లాలిపాటలు, (చిలిపి కృష్ణుని) చిలిపి పాటలు (చింతచెట్టు చిగురు), (భళా

ఘంటసాల గారి గురించి ఏమని చెప్పాలి. ఆయన కంఠంలో ఎన్ని భావాలు. ఆయన గాత్రంలో ఎన్ని పార్శ్వాలు! ఆయన సంగీతంలో ఎన్ని సుమధురోహాలు!

పాతాళభైరవిలో ఎంత ఘాటు ప్రేమయో పాటకు అన్ని కాలాల ప్రణయగీతాలలో మొదటి స్థానం యిచ్చే ఎంతోమంది సంగీత ప్రియులు ఉన్నారు. చందమామచేత చల్లగా మనవి చేయించే పాటలో ‘సందెవేళసుందరాంగి’ పదప్రాసలో ఘంటసాల వారు ఎంత అందమైన భావాలు పలికిస్తారో.

‘నా చందమామ అందాల భామ’ పాటలో ఉద్విగ్న, అనిశ్చిత భావాలకు ఘంటసాల మాస్టారు పలికించే తీరు మరపురానిది, మరువలేనిది. యిలా ఒకటి, రెండా రాసుకొంటూ పోతే కొన్ని వేల పేజీలు రాయాల్సి వస్తుంది.

భక్తిపాటలు, (శేష శైలావాసా) లాలిపాటలు, (చిలిపి కృష్ణుని) చిలిపి పాటలు (చింతచెట్టు చిగురు), (భళా భళా నాబండి) విషాద పాటలు (చెలియలేదు, చెలిమిలేదు) వేదాంతాలు (మత్తువదలరా) ప్రణయ గీతాలు (చిటపట చినుకులు పడుతూ ఉంటే) హాస్య పాటలు. ఆంగ్లంలో చెప్పినట్లు genre వారీగా ఎన్నో పాటలు పాడి ఆయన శ్రోతలను అలరించారు.

పయనించే ఓ చిలుకా పాటలోని ఉదాత్తత, పాడుతా తీయగా చల్లగా పాటలోని భావాతీతమైన ఓదార్పు, హిమగిరి సొగసులు పాటలోని విభ్రాంతితో కూడిన పారవశ్యం ఆయన అనుభవించి మనకు చేరవేయడం మన అదృష్టం.

ఘంటసాల గారి పాటలతో నా మొదటి పరిచయం నా మిత్రుడి ద్వారా జరిగింది. ఎప్పుడు పాట పాడమని అడిగినా అతను తెలుగువీర లేవరా పాట పాడేవాడు. ఆ పాటలోని రౌద్రం, ఆవేశం నాకు తెలియని ఉత్సాహం కలిగించేది. పెద్దయిన తర్వాత ఆ పాటను విని ఒళ్లు గగుర్పోడిచిందన్న నిజం చెప్పక తప్పదు. యింట్లో గ్రామ ఫోను రికార్డరులో దేవదాసు రికార్డును తరచూ వినేవాళ్ళం.

అందులో అక్కినేని నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ! అమర గాయకుడు ఘంటసాల, ఈనాడు మనకు లేక పోయినా! అనే మాట అంటారు. అప్పట్లో చిన్నతనంలో ఎవరీ ఘంటసాల అని అడిగితే ఈ రికార్డులోని పాటలు పాడిన ఆయన అని యింట్లో చెప్పే వాళ్లు. అల దేవదాసులో కుడి ఎడమైతే; కలఇదని, జగమే మాయ, పాటలు పాడిన గాయకుడు ఘంటసాల గారిపై నాకు గౌరవం, అభిమానం ఏర్పడ్డాయి.

ఆ తర్వాత ఆయన పాటలు తెలుసుకోవాలనే నిశ్చయంతో నేను తెలుగులో పాత సినిమాలు చూడడం మొదలు పెట్టాను. అలా ఘంటసాల గారి పాటలమీద ఏర్పడిన మమకారం, అభిమానం ఇప్పటికీ నిలిచిపోయింది. ఆయన పాడే విధానంలోని భావసాంద్రత, స్వచ్ఛమైన ఉచ్ఛారణ యిలా ఎవరికి తోచిన, నచ్చిన లక్షణం వారు చెప్పుకుంటూ ఉంటారు. కాని ఒక పాటను సందర్భోచితంగా పాత్రలో ప్రవేశం చేసి ఆయన పాడే విధానం వేరే ఎవ్వరికైనా సాధ్యమా! జగదేకవీరుని కధ సినిమాలో ‘శివశంకరరీ, పాటను సంగీత విధ్వాంసుడు పాడినట్లే ఉంటుంది. తెనాలి రామకృష్ణ చిత్రంలో ‘నరసింహ కృష్ణరాయ’ పద్యాన్ని రామకృష్ణ కవే పాడినట్లుగా, పాండవ వనవాసంలో ‘మాయలతో ‘జనియించి’ పద్యాన్ని యక్షుడే పాడినట్లుగా, పండంటి కాపురం సినిమాలో ‘బాబూ వినరా’ పాటను పెద్దన్నయ్యే పాడినట్లుగా అనిపిస్తూ ఉంటుంది. మహాకవి కాళిదాసులో, జగన్మాత సాక్షాత్కారంతో పరవశమైన కాళిదాసు యిలాగే శ్లోకాలు చదివాడా అని అనిపిస్తుంది.

ఆయన ప్రైవేటు పాటల్లో ‘మరువలేనురా పోలీసెంకటసామి’ కాని, ‘రావోయి బంగారి మామ’ పాటల్లో గాని ఉన్న మృదు మధురమైన లాలిత్యం, అమాయకమైన ప్రేమ యింక ఎక్కడైనా వినగలమా!

బహుదూరపు బాటసారి, యిటురావో ఒక్కసారి అని మృత్యువుని ఆహ్వానించుకున్న ఘంటసాల గారు మరలిరాని లోకాలకు తొందరగా వెళ్ళిపోయారు. అమరగానం గురించి తెలియని వారెవరైనా సరే చింతించాల్సిన అవసరం లేదు. ఘంటసాల గారి పాటలలో దేవ లోకపు అంచువరకూ చేరుకున్న ఆనందపారవశ్యం పొందవచ్చు.

తెలుగువారికి ఘంటసాల గారు ఉన్నారు. ఆయన సంగీతంలో సేదతీరవచ్చు. విశ్రాంతి పొందవచ్చు, కర్తవ్యోన్ముకులు కావచ్చు, జీవిత సారాంశం అర్ధం చేసుకోవచ్చు.

వేయి వేణువులు మ్రోగేవేళ

హాయి వెల్లువై పొంగేవేళ

మముపాలింపగ నడచి వచ్చితివా!

( 11 ఫిభ్రవరి ఘంటసాల గారి వర్ధంతి సందర్భంగా )

Share Your Comments

I would love to hear your thoughts.