Literature July 2023

వనవాసి — Bibhutibhushan Bandyopadhyay

భిభూతి భూషన్ బందోపాధ్యాయ

వనవాసి

ఒక ప్రకృతి ఆరాధకుని జీవితం గురించిన ఈ నవలలో వర్ణన, సౌందర్య పిపాస, ప్రకృతి ఆరాధన అత్యంత రమణీయంగా ఉన్నది. బీహార్లోని కుసినది, లవటాలియా అడవుల్లో కచేరి పనులు చక్కబెట్టడానికి వచ్చిన రచయిత నిర్జన, నిశీధీ, సౌందర్యంతో శోభిల్లుతున్న ఆ వనాలలో లీనమైపోతాడు. ఆ అరణ్యవాసుల జీవన సౌoదర్యం, బ్రతుకు పోరాటాలతో మమేకమవుతాడు. భూమికీ, పర్యావరణానికీ, మానవ అభివృద్దికి, పురోగతికి వైరుధ్యం ఉన్నది. బీహార్ ప్రాంతం లోని జమీందారుల ఎస్టేట్ లను అభివృద్ధి చేసి కౌలుకి ఇచ్చే పని మీద రచయిత నియమింపబడతాడు. అత్యంత రమణీయమైన ప్రకృతి సౌందర్యాలకు ఆలవాలమైన ఆ వనాలు, అడవులు, నదులు, పర్వతాలలోని అద్భుత దృశ్యాలకు రచయిత సమ్మోహనుడై పోతాడు. నాగరికత చిహ్నాలకు కడుదూరం లోని ఆ ఎస్టేట్ పై ఎంతో ప్రేమను, అనురాగాన్నిపెంచుకుంటాడు. ఏదైనా పని మీద అవతల పట్టణాలకు వెళ్ళవలసి వచ్చినా తిరిగి ఎప్పుడెప్పుడు వాలి పోతామా అని పలవరిస్తాడు. ఆ ఉషోదయాలు. ఆ సూర్యాస్తమయాలు, ఆ కిలకిలలు, ఆ వెన్నెల వెలుగులు, ఆ భయంకర నిశ్శబ్దాలు, ఆ శీతాకాలపు రాత్రులు, అక్కడి వన్య మృగాలు, మనుషులు, ఆ మాధవీ లతల సౌరభాలు, ఆ చెట్ల విశ్వరూపాలు ఆ పూల సుగంధ పరిమళాలు ఆయనను కట్టి పడేస్తాయి.

ఎంతటి సౌందర్యమైనా వీక్షించే వారికి అర్ధం చేసుకునే భావన ఉండాలి. రసానుభూతిని పొందే భావుకత ఉండాలి. రచయిత దృక్పధం, దృక్కోణం, సౌందర్య ఆరాధన, భావావేశం మరియు పరవశం: A Pantheistic vision, ఆ నిర్జన, ప్రశాంత, కీకారణ్యంలో సౌందర్య అనుభూతి, ప్రకృతి, తన రహస్యాలను, ఆయనకు చేరవేస్తున్నట్లు మనకు గోచరిస్తుంది.నవల కన్నా దీనిని ప్రకృతి కావ్యం అనవచ్చు నేమో.

ఆ అరణ్యాన్ని, ఎస్టేట్ లను సాగుభూమిగా మార్చి, తన కచేరీ యజమానుల ఆదాయాన్ని ఇనుమడింప జేయడం రచయిత బాధ్యత. కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన ఎస్టేట్ వదలి తిరిగి కలకత్తాకు వెళ్ళేటప్పుడు ఆయన ప్రకృతికి, ఆ అరణ్యాలకు చేసిన విధ్వంసాన్ని తలుచుకుని బాధ పడుతాడు. నేరుగా ఆయన బాధ్యుడు కాకపోయినా ఆయన సాధనంగా ఈ అభివృద్ధి అంతా సాధ్యమవుతుంది. ఆ విధంగా ఈ నవల ఒక human document on conservation vis-à-vis development గా మనం చూడవచ్చు.

ఈ బెంగాలీ నవలను తెలుగులోకి అనువాదం చేసినట్లుగానే అనిపించదు. సూరంపూడి సీతారాం గారి అనువాదం ఎంతో అందంగా, ఆనందంతో మనలను చదివింప చేస్తుంది. వారు కూడా బీహార్ లోని ఆ అడవుల అద్భుత సౌందర్యాన్ని రచయిత లాగా కాంచినట్లుగా ఉంటుంది. ఈ నవలలోని strength and power అటువంటిది.

ఈ ఎస్టేట్ గ్రామాలు, వనాలలోని మనుషుల జీవన శైలి, వారి ఆటుపోట్లు, వారి శ్రమ జీవన సౌందర్యం, నిష్కల్మషమైన వారి ఆలోచన, ప్రేమ, అనురాగం కూడా ఈ నవలలో రచయిత చక్కగా ప్రతిభింబించారు. నిజంగా వారిపట్ల ఆయనది దయ, కారుణ్య దృష్టి. ప్రాధమికమైన వారి అవసరాలు. కేవలం మినప్పిండి, మజ్జిగ కోసం వారు పడే తాపత్రయం, ఒక యిత్తడి లోటా దొరికితే ఎదో నిధి దొరికినట్లు భావించడం, వారి దుర్భర దారిద్య్రయాన్ని సూచిస్తాయి. వారి దారిద్య్రయాన్నిదోపిడీ చేయక, ఎవగించుకోక, రచయిత సహానుభూతితో పరికిస్తాడు.

వనవాసిలో ఒక plot లేదు. వనవాసి ఒక గాఢమైన తాదాత్మ్యత. ప్రకృతి ఒడిలో రచయిత గాంచిన ఒక రంగుల, సుందర దృశ్యం. సృష్టి కర్త ఎన్నో లయలలో, ఇంకెన్నో అనుభూతులతో రచయితకు మాత్రమే ఇచ్చిన ఒక స్వీయ గ్రంధం.

Share Your Comments

I would love to hear your thoughts.