ప్రేమ గురించి ఆలోచిస్తే నాకు మొదట గుర్తుకొచ్చే నవల లవ్ ఇన్ ది టైమ్ ఆఫ్ కలరా. ప్రేమ లోని అనేక దృక్కోణాలు, పార్శ్వల గురించి Marquez ఈ నవలలో విస్తృతంగా స్పృశించాడు. ప్రేమ నిర్మలమైనది, అమలినమైనది కాదని ఈ నవల మనకు తెలియచేస్తుంది. ప్రేమలో అనంతమైన స్వార్ధం ఉన్నది, అనుకున్నది, కోరుకున్నది దక్కించుకోవాలన్న కాంక్ష ఉన్నది. నేను చదువుకున్న త్యాగమయమైన ప్రేమ కధలకు ఇది పూర్తిగా భిన్నమైనది. యుక్త వయస్సు నుంచి తను ప్రేమించిన Fermina daza ను పొందలేక పోతాడు Florentino ariza. ఈ వన్ sided ప్రేమ రాక్షసంగా, అనైతికంగా అనిపిస్తుంది. ఎందుకంటే Fermina daza ను ప్రేమిస్తూనే Florentino ariza ఎన్నో చాటు మాటు ప్రేమ/కామ కధలు నడుపుతూ ఉంటాడు. ఇలా ఏళ్లు గడిచిపోయాక, Fermina daza భర్త చనిపోయాక, తన స్వప్న ప్రేయసి, తన కలల రాణి, జీవితపు ఒకే ఒక ఆశా నౌక తో తన అంతరంగాన్ని విప్పుకునే అవకాశం దొరుకుతుంది అతనికి. Florentino ప్రేమ కధ విని సంభ్రమం, ఆశ్చర్యం, విస్మయం పొందడం Fermina వంతు అవుతుంది. ఏడు పదులు దాటిన తర్వాత, ఆ పండు వయస్సులో, తొలి ప్రేమ నాటి వెచ్చదనాన్ని పొందాలని ఈ ప్రేమికులు ఇద్దరూ దగ్గిర అవుతారు. వారు ప్రయాణిస్తున్న నౌక మీద కలరా ఉందన్న అనుమానంతో ఏ రేవులోకి దానిని అనుమతించరు. ఆ నౌక కే యజమాని అయిన Florentino ను ఏమి చేయాలని కెప్టెన్ అడుగుతాడు.. Florentino నడుపుతూనే ఉండమంటాడు. కెప్టెన్ ఎంత కాలం అనే ప్రశ్నకు Florentino, “For ever “ అంటాడు. అదే నవలలో 16 ఏండ్ల అమ్మాయి Rosalba, ముసలి వాడైన Florentino తో ఎలా ప్రేమలో పడుతుందో రచయిత వివరిస్తాడు. ఇక తన సందేశాన్ని Fermina కు చేర వేయడానికి Florentino ఎంతగా శ్రమిస్తాడో రచయిత అద్భుతంగా వర్ణిస్తాడు. పావురాలతో, చిలకలతో సందేశాలు, తపాలా బంట్రోతుల ద్వారా లేఖలు, Fermina governess గా నియమించబడిన ఆమెను లోబరుచుకుని ఆవిడ ద్వారా సందేశాలు లాంటి వన్నీ Florentino చేస్తాడు. అతని ప్రేమ ఒక అద్వితీయమైన ప్రబంధ నాయకుడి స్థాయిలో ప్రదర్శితమవుతుంది. ఎన్ని అడుగులు వేసినా, ఏ పని చేసినా, జీవితంలో ఎంత సాధించినా పరిపూర్ణత పొందని తన ప్రేమ యొక్క విషాద వదనానికి గుర్తుగా Florentino ariza ఎప్పుడు నల్ల రంగు దుస్తులే ధరిస్తాడు.
మరొక నవల వంద సంవత్సరాల ఏకాంతం (One Hundred Years of Solitude) లో Marquez దైవిక, విశృంఖులమైన ప్రేమను వర్ణిస్తాడు! సాంగత్యం, ప్రేమ కోసం పరితపించే బుఎండియా పరివారం, ఏడు తరాల మధ్యలో, ప్రేమకు, ప్రేమ రాహిత్యానికి, దైవిక అనుభూతికి, కామోద్రేకానికి నడుమ సంఘర్షణ పడుతూ ఉంటుంది. వంద సంవత్సరాల ఏకాంతం నవలను Marquez రచించిన విధానం magical realism గా ప్రాచుర్యం పొందింది. వాస్తవికతకు, అద్భుతానికి మధ్య ఒక డోళాయమానమైన అధివాస్తవికతను రచయిత సృష్టించాడు. ఆయన నవలలో ఈ narrative technique కు చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఉన్న పళంగా Remedios ది Beauty ఆకాశంలోకి ఎగిరిపోవడం, ఆమె, వర్ణణకు అతీతమైన నగ్న సౌందర్యాన్ని (ఇంటిలో ఆమె నగ్నంగానే సంచరిస్తుంది) చూడడానికి పోటీపడి, చూసిన తర్వాత చూసిన వారందరూ నిర్వేద విషాదానికి లోను కావడం, బుఎండియా ల అమ్మ Ursula చనిపోయినపుడు, ఆకాశంలోనుంచి పూల వర్షం కురియడం, కల్నల్ బుఎండియా కొడుకులు అందరూ (26 మంది) ఒకే సారి కూడ పలుక్కొని Macondo కు రావడం, అందరి మొహం లో ఆ నిరంతర సంఘర్షణ కారుడు, విప్లవ వాది లోని శూన్యత గోచరించడం,వారందరూ వెళ్లిపోయే ముందు తన పుత్రుని పుత్రులను గుర్తించడానికి Ursula అందరికీ నుదుటి మీద ఒకే టాటూ వేయడం, అదే టాటూ ఆధారంగా కల్నల్ బుఎండియా శత్రు పక్షం వాళ్ళు అందరినీ వేటాడి ఒకరి వెనకాల ఒకరిని చంపి వేయడం! గగుర్పాటు, మైమరుపు, అంతు లేని విభ్రాంతి, విషాదం పాఠకుడి ని ఆవరిస్తాయి. లాటిన్ అమెరికన్ జీవితం, జీవన విధానం, సాహిత్యం, సంస్కృతి, సామాజిక దృక్పధం, జానపదం ఈ నవల అంతటా ప్రతిబింబిస్తాయి. ప్రేమ కోసం పరితపిస్తున్న బుఎండియా వారసులు నిషిద్ద ప్రేమలో (incest ) తల మునకలవుతారు. ఈ ఆఖరి వారసులు ఆ ప్రేమ ప్రభావంలో పూర్తిగా అశక్తులవుతారు. ఆకలికి, ఆహారానికి కూడ లేవరు. ఈ రాక్షస,విధ్వంసకరమైన ప్రేమనే Marquez నవలలో దర్శించగలము. నేను అదివరకు చదువుకున్న అమలిన, సునిశిత ప్రేమకు ఇది పూర్తిగా విరుద్దం. Marquez ప్రేమ దర్శనం, వాస్తవం. అది నిజానికి, sensuality కి అతి దగ్గిరగా ఉన్నది.