ఎప్పుడైనా ఐశ్వర్యం లోని వేదన గమనించావా ? నా ఫ్రెండ్ ఒక ఇంటి వైపు చూపిస్తూ నన్ను అడిగాడు . నేను సమాధానం చెప్పే లోపల అతనే “ వాంఛ, ఆశయం, కోరికల సాధనే ముఖ్యం అనుకునే ఈ ప్రపంచంలో తాతలు సంపాదించిన ఆస్తిని ఏమి చేయాలో తెలియక , ఎలా అనుభవించాలో అర్ధం కాక కొంత మంది వ్యక్తులు మనకు అప్పుడప్పుడు కనపడుతుంటారు. ఛెకొవ్ లాంటి రచయితలు అయితే అందు లోని వేదనను ఇట్టే పసికట్టగలరు . అదిగో ఆ ఇంటిలో నేను అలాంటి వ్యక్తినే చూశాను అని చెప్పడం మొదలు పెట్టాడు.
స్పీడుగా కొత్త ఇంపాల కారు పండ్ల అంగడి దగ్గిరకు వచ్చి ఆగింది. డ్రైవరు కారు దిగి డజన్ ఆపిల్, డజన్ దానిమ్మ పండ్లు బేరం చేస్తున్నాడు. యూనీఫార్మ్ లో ఉన్న కారు డ్రైవరు పండ్లు pack చేయిస్తూ ఉంటే , కారు వెనకాల సీట్లో ఖరీదైన మద్యం తాగుతూ సిల్క్ రెడ్డి కూర్చొని ఉన్నాడు. నోట్లో సిగిరెట్ వెలుగుతూ వుంది. పెంచిన గడ్డంలో కూడా అతని మొహంలో ఆకర్షణ ఉన్నది. సరిగంచు పంచ మీద సిల్క్ లాల్చీ వేసుకున్నాడు . తన చుట్టూ జరుతున్న దానితో సంబంధం లేదన్నట్లు తాను జీవిస్తున్నది తన కోసమే అన్నట్లు అతను ప్రవర్తిస్తూ ఉన్నాడు. సిల్క్ రెడ్డి కారు చూస్తానే చుట్టూ ఉన్న నలుగురు బిచ్చగాళ్లు ఆ కారు చుట్టూ చేరారు. కారు అద్దం నిర్లక్ష్యంగా కిందికి దింపి ఒక్కకొరికి 10 రూపాయల చొప్పున ఇచ్చి మళ్ళీ తన పనిలో మునిగిపోయాడు. సిల్క్ రెడ్డి పేరు ఎవరికి గుర్తు లేదు. వీధిలోకి వస్తే సిల్క్ బట్టలే వేసుకుంటాడని అతనికి ఆ పేరు పెట్టారు. పండ్ల కొట్టు వ్యాపారి కి డబ్బు ఇచ్చి, అతని దగ్గర సలాం తీసుకుని వెళ్లిపోయేవాడు. వారంలో అనుకున్నప్పడు కారులో బ్రాందీ షాప్ కి పోయి కావలసిన సరుకు కొనుక్కునే వాడు. ఎవరైనా నా లాంటి స్నేహితులు అడిగితే మా అయ్య ఇల్లు పగల సంపాదించాడు, నేను అనుభవిస్తున్నాను అనేవాడు. ఖర్చు చేసే మార్గాన్ని రెడ్డి ఆ విధంగా ఎంచుకున్నాడు. అలాంటి రెడ్డి ఏ ముహూర్తంలోనో ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. ఆ అమ్మాయి కోసం అన్నీ మానేసి మామూలు మనిషి గా మారాడు. విలాసాలు , విందులు, మందు బదులు పార్కులు, సినిమాలు, గుడులు, దేవాలయాలు అంటూ ఆ అమ్మాయి తో తిరిగాడు. సిల్క్ రెడ్డిలో నిజమైన ఆ మార్పు ఆ వీధిలో , ఊరిలో అందరినీ ఆశ్చర్య పరిచింది. ఆ అమ్మాయి కూడా రెడ్డి పెళ్లి ప్రతిపాదనకు ఒప్పుకుంది. అమ్మాయికి సిల్క్ రెడ్డి నచ్చినా ఆమె ఇంటిలో వాళ్ళకు నచ్చలేదు. గతంలో అతను ఎలా ఉండేవాడు, పెళ్లి తర్వాత మళ్ళీ పాత పద్దతిలోకి మారడు అని ఏమిటి నమ్మకం ? ఈ ప్రశ్న తో చాలా రోజులు పెళ్లి ప్రతిపాదన వాయిదా వేసి కొద్ది రోజుల తర్వాత ఆ అమ్మాయికి వేరే అతనితో వివాహం జరిపించారు. మారాను అని చెప్పినా వినని సమాజం పట్ల రెడ్డికి గౌరవం పూర్తిగా పోయింది. ఆ అమ్మాయికి వేరే పెళ్లి అయిన వెంటనే తిరిగి తాగడం మొదలు పెట్టాడు; ఈ సారి కసిగా , కావాలని ఏదో ఒకటి జరగాలి అనే ఉద్దేశ్యంతో ప్రవర్తించడం మొదలు పెట్టాడు. ఒక రోజు ఎంత పొద్దు పోయినా రూమ్ లోనుంచి రెడ్డి బయటకు రాలేదు. తలుపులు తెరిచి చూస్తే bathtub లో మునిగి, చనిపోయి కనపడ్డాడు. టబ్ పక్కనే ఖాళీ ఫుల్ బాటిల్ కనిపించింది. “Death due to drowning . Loss of consciousness due to over intoxication” అని రాశారు. ఎప్పుడూ తిరస్కారం తెలియని సిల్క్ రెడ్డి ఎవరి మీద కక్ష తీర్చు కోవాలో తెలియక తనకు తానే శిక్ష వేసుకున్నాడు