ఫిజిక్స్ పుస్తకం తెరిచి Laws of Thermodynamics చదువుకోవాలని అనుకుంటున్న రాజారావ్‌కి పక్క రూములోనుంచి మాటలు వినపడుతున్నాయి. “మెల్లిగా! గట్టిగా మాట్లాడకండి, పక్క గదిలో అన్న చదువుకుంటున్నాడు,” మిగతావాళ్లకి సూచనలు ఇస్తున్నట్టు ఒక స్వరం. సంగీత సాధన చేసి అలిసిపోయి తిరిగి సవరించుకుంటున్నట్లు ఉంది. ఆ స్వరంలో అహంకారం, హాస్యం రెండూ ఉన్నాయి.
రాజారావుకి కనపడేటట్లు రెండు రూముల మధ్య తలుపు కొద్దిగా తెరిచి ఉంది. ఆ గదిలో పెద్ద టేబుల్ చుట్టూ 8 మంది అమ్మాయిలు హిందీ పాటలు సాధన చేస్తూ, నాట్యం కూడా చేస్తున్నారు. Mohd. Rafi పాడిన ‘హమకో తుమహారే’ పాట పదే పదే వినపడుతూ ఉంది. అందరిలోకి పొడుగ్గా ఉన్న అమ్మాయి సూచనలు ఇస్తూ ఉంది. మధ్యలో డాన్స్ టీచర్ కొన్ని సూచనలు ఇస్తూ ఉన్నా, అమ్మాయిలు అందరూ భావన వైపు చూస్తున్నారు. హరిణికి ఉండవలసిన కన్నులు ఇక్కడకు వచ్చి ఆ అమ్మాయికి అమరాయేమో? ఆ కళ్లతో ఆ అమ్మాయి అందరినీ కట్టిపడేస్తోంది. సన్నటి rimless అద్దాలు ఆ కళ్లకూ, ఆమెకూ మేధావితనాన్ని తీసుకొస్తున్నాయి. ఆమె జడ పొడుగ్గా ఉండడం వలన ముందుకు వేసుకుని నాట్యం చేస్తూ ఉంది. ఎవరైనా పొరబాటు చేస్తే ఆ అమ్మాయి చిరు కోపంతో సవరిస్తూ ఉంది.
అమ్మాయిలందరూ డాన్స్ స్టెప్స్ నేర్చుకోవడం చేస్తుంటే, భావన మాత్రం మధ్య మధ్యలో రాజారావ్ రూమ్ వైపు ఒక కంట చూస్తూ ఉంది. ఆ అమ్మాయి అలా చూస్తున్నప్పుడు రాజారావ్ అదే సమయానికి అటువైపు చూడడం, ఆ అమ్మాయి వెంటనే వేరే వైపు తిరిగి కూర్చోవడం జరుగుతూ ఉంది. ఒక క్షణం వాళ్ల చూపులు కలిసినప్పుడు రాజారావ్‌కి లోలోపల జలదరిస్తోంది. రాజారావ్ ఎప్పుడూ అమ్మాయిలని చూడలేదని కాదు. ఎంతో మందిని స్కూల్లో, కాలేజీలో కలుసుకున్నాడు, మాట్లాడాడు. కానీ మొదటిసారి తన గురించి ఆసక్తి చూపుతున్న అమ్మాయిని చూస్తున్నాడు.
అందరినీ వారిస్తూనే రాజారావ్‌కి వినపడేటట్లు భావన గట్టిగా మాట్లాడడమో లేదా పాట ఆలపించడం చేస్తూ ఉంది. “ఏయి — ఇక్కడ వద్దులే. వేరే రూముకి పోదాం. అన్న చదువుకుంటున్నాడు,” రాజారావ్‌కి వినపడేటట్లు అనేసి భావన అందరినీ తీసుకుని వెళ్లిపోయింది. వెళ్లిపోయిన అమ్మాయిలతో కలిసిపోవచ్చు, జట్టు కట్టచ్చు. కానీ రాజారావ్ అలా చేయలేడు. నూరిపోసిన భయం, స్వతహాగా ఉన్న బిడియం రాజారావ్‌ని అడుగు ముందుకు వేయనీయవు. కానీ వాళ్లు తన గురించి ఏం మాట్లాడుకుంటున్నారో? ముఖ్యంగా తన గురించి ఏం కామెంట్స్ చేస్తున్నారో వినాలని అతనికి ఉత్సుకత ఉన్నది.
వరండాలోకి వెళుతూ రాజారావ్ వాళ్లు వదలి వెళ్లిన రూములోకి వెళ్లాడు. ఆ రూములో తరంగాల్లాగా పాటలు, మాటలు శబ్దం చేస్తున్నట్లు ఉంది. వాళ్లలో ఎవరో లావెండర్ పౌడర్ వాడతారేమో; ఆ గదంతా లావెండర్ సువాసన సున్నితంగా అలుముకొని ఉంది. ఆ తర్వాత ఎన్నో సంవత్సరాలు లావెండర్ సెంట్తోనే రాజారావ్‌కి భావన గుర్తుకు వచ్చేది. రాజారావ్ అటూ ఇటూ చూస్తూ ఉండగానే భావన పరిగెత్తుతూ మళ్లీ రూములోకి వచ్చింది. “బ్యాగ్ మరిచిపోయాను,” అని డెస్క్ లోపల బ్యాగ్ తీసుకుని పరిగెత్తుతూ వెళ్లిపోయింది.
పరిగెత్తుతూ భావన నవ్విన చిరునవ్వు రాజారావ్ మరిచిపోలేక ఉన్నాడు. వేల వేల దరహాసాలు ఆమె కళ్లలోంచి రువ్వుతున్నట్లుగా ఉంది. ఆ అమ్మాయి తనని అన్న అని పిలుస్తున్నా, ఆ పిలుపులో ఏదో అపసవ్యత ఉన్నట్లు అనిపిస్తున్నది. రాజారావ్ కళ్లు ఆమెలోని సౌందర్యం కోసం వెతుకుతున్నాయి. 5.5 అడుగులు దాటి ఉన్న భావన హుందాగా ఉంది. ఆమె అద్దాలు, గాలికి కదులుతున్న ఆమె ముందు పాపిటి, సౌందర్యంలో వేరే కోణాలు చూపుతున్నాయి. అమ్మాయిలు అందరూ తనని ఒంటరిని చేసి ఆడిపిస్తున్నారని రాజారావ్‌కి అనిపిస్తున్నది. అదే మనస్సులో ఉంచుకుని వాళ్లతో మాట్లాడకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ మనస్సు ఆగలేకపోతున్నది. వాళ్లు ఏమి చేస్తున్నారో? ముఖ్యంగా భావన ఏమి చేస్తున్నదో? సాయంత్రం కాలేజీ నుంచి వచ్చాక వార్డెన్‌కి చెప్పి రూమ్ మార్పించుకోవాలని అనుకున్నాడు.
ఎంత వద్దని అనుకున్నా ఆకర్షణ దాని పని అది చేసుకుంటూ ఉంటుంది. రాజారావ్ దూరం జరగాలని అనుకుని ఇంకా దగ్గరయ్యాడు. సీనియర్ కావడం, మెట్రిక్ మంచి మార్కులతో పాస్ కావడంతో, వార్డెన్ క్రింది తరగతి వాళ్లని టీచర్స్ లేనప్పుడు doubts ఏదైనా ఉంటే రాజారావ్‌ని అడగమని చెప్పింది.
స్టడీ టైమ్‌లో ఒక రోజు, “Past tense of write is wrote, writed కాదు,” అంటోంది భావన. “కాదు, writed. ఎందుకంటే wait past tense waited కదా?” భావన చెల్లి భారతి అంటోంది. “లేదు, wrote. కావాలంటే అన్నను అడుగుదాం పద,” అంటోంది భావన. “సరే పద, అడుగుదాం. అన్నా, write past tense writed కదా? భావనక్కకి చెప్పు,” అని పరిగెత్తుకుంటూ రాజారావ్ దగ్గరికి వచ్చి అడిగింది భారతి. దూరం నుంచి ఇది భావన గమనిస్తూ ఉంది. ఒక చేత్తో నోట్లో పెన్ కదుపుతూ రాజారావ్ ఏమి చెబుతాడో అని వింటూ ఉంది. “Write past tense wrote కాదు, writed కరెక్ట్,” భావనకి వినపడేటట్లు రాజారావ్ గట్టిగా చెప్పాడు. “ఎస్, నేను చెప్పిందే కరెక్ట్,” వేగంగా వెనక్కి వెళ్లిపోయింది భారతి. దూరం నుంచి భావన చూసిన చూపుతో రాజారావ్లో అలజడి మొదలయ్యింది.
సాయంత్రం లాన్లో వేప చెట్టు దగ్గర ఎవ్వరూ లేని సమయంలో భావన రాజారావ్ దగ్గరికి వచ్చి నిల్చుంది. ఆ సాయంత్రం ఆ అమ్మాయిలోని మెరుపు రాజారావ్ మనస్సులో అద్దుకున్నది. దూరంగా వీధిలోని మెర్క్యురీ లైట్ నీడ ఆమె కళ్లద్దాలలో పడి చెదిరిపోతూ ఉంది. ఆ సమయంలో ఆమె స్కూల్ అమ్మాయిలాగా కాక, నడిచి వచ్చి నిలుచున్న అందమైన బొమ్మలాగా ఉంది. మొదటిసారి అన్న అనే మాట వదలి, “ఎందుకు నా చెల్లికి తప్పు చెప్పావు?” అన్నది. “ఔను, write past tense wrote అని తెలుసు. కానీ ఆ సమయంలో ఎందుకో అలా చెప్పాలని అనిపించింది,” అన్నాడు రాజారావ్. “అంటే కావాలనే చెప్పావా? లేకపోతే నన్ను తప్పుగా చూపించాలని అలా చేశావా?” భావన మొహంలో కోపం ఛాయలు కనపడుతున్నాయి.
నిజంగా కోప్పడిందా లేక కోపం నటిస్తోందా? రాజారావ్‌కి అర్థం కావడం లేదు. నిజంగా భావన కోప్పడితే రాజారావ్ తట్టుకోగలడా? ఒకవేళ కోపంతో మాట్లాడడం మానేస్తే? రాజారావ్‌కి ఏమి మాట్లాడాలో తెలియడం లేదు. వయస్సులో తనకన్నా భావన రెండు సంవత్సరాలు చిన్నది అయినా, తన మీద ఆమెకి ఎదురు చెప్పలేని నియంత్రణ ఉన్నదని అతనికి తెలుస్తూ ఉంది. “మీకు English అంత బాగా వచ్చు కదా? రేపటి నుంచి భారతికి ట్యూషన్ చెప్పండి,” ఒక ఆర్డర్ ఇచ్చేసి భావన వెళ్లిపోయింది. దూరంగా అమ్మాయిలందరూ గుంపుగా నిలబడి వారినే చూస్తున్నారు. భావన వారితో కలుసుకోవడం, వారంతా కలిసి తిరిగి ఆట మొదలుపెట్టడం జరిగింది.
వాళ్లు ఆడుతున్న ఆట తమాషాగా ఉంది. పాటకు నృత్యం చేస్తూ ‘stone’ అన్న మాట వినపడగానే ఎక్కడివాళ్లు అక్కడ స్థాణువుల్లా నిలబడిపోవాలి. పాటకు నృత్యం చేస్తూ ఆగిపోతున్న అమ్మాయిలు శిల్పాల్లాగా ఉన్నారు. వారిలో భావన అపరాజిత లాగ ఉంది.
రాజారావ్‌కి నిద్ర పట్టడం లేదు. అతని కలల్లో ఈ నృత్య దృశ్యాలు కనపడుతున్నాయి. రోజులు గడుస్తున్నాయి. రాజారావ్ కాలేజీకి వెళ్లి వస్తున్నాడు. హాస్టల్లో అవతలి గదులలోంచి రోజూ సాయంత్రం సంగీతం వినపడుతూ ఉంది. ఒక రోజు రఫీ, మరొక రోజు లతా; ఈ పాటలు ఎవరో సాధన చేస్తున్నారు. ఆ స్వరంలోని మాధుర్యం వింటూ రాజారావ్ ఊహాలోకాల్లో తేలిపోతున్నాడు. ఖచ్చితంగా అది భావన స్వరమేనని అతను ఆనందపడిపోతున్నాడు. ప్రకృతి అన్ని గుణగణాలు ఆ అమ్మాయిలో ఎలా తీర్చిదిద్దిందో?
ఏమయ్యిందో ఏమో? రాజారావ్‌కి భావనను కలుసుకునే అవకాశం దొరకటం లేదు. ఆమె స్వరం వినాలని రాజారావ్ మనస్సు తహతహలాడుతూ ఉంది. ఎదురుగా కూర్చుని ఆమె మొహంలో పలికే భావాలు, హొయలు చూడాలని ఉంది. భారతి మాత్రం రోజూ రాజారావ్ దగ్గర English చెప్పించుకుంటూ ఉంది. భావన అంతులేని మిస్టరీ! నిశ్చలంగా ఉండే రాజారావ్‌ని కదిలించి ఆ అమ్మాయి కనపడడం మానేసింది.
ఒక రోజు సాయంత్రం భారతి కనపడగానే భావనకు ఇమ్మని ఒక లెటర్ రాసి ఇచ్చాడు రాజారావ్. ఆ లెటర్ అందుకుని ఏడిచినంత పని చేసింది భారతి. ఆ అమ్మాయి రియాక్షన్ చూసి రాజారావ్ కంగారు పడిపోయాడు. “నేనే ఓడిపోయాను. మీరు లెటర్ తప్పక రాస్తారని అక్క చెప్పింది,” భారతి అన్నది. రాజారావ్‌కి తల తిరిగినట్లు అయ్యింది. “ఏమంటున్నావు భారతి? ఈ పందెం ఏమిటి?” “భావన వచ్చే సంవత్సరం వేరే కాలేజీలో చేరబోతూ ఉంది. ఈ లోపల మిమ్మల్ని ఒక ఆట పట్టిస్తానని మాతో పందెం కాసింది. అయినా అంతేలే. మా అక్క అనుకున్నది సాధించి తీరుతుంది.” రాజారావ్ లెటర్ని విసురుగా సంచిలో పడేసి భారతి వెళ్లిపోయింది. ఏమి అనుకోవాలో తెలియక తెల్లమొహం వేసుకుని కుర్చీలోకి జారిపోయాడు రాజారావ్.