“ఇదిగో ఇది వడ్డించుకోండి . ఇది నేనే వండిన హల్వా “ ఆశ్రమంలో స్వామీజీ మాకు భోజనం వడ్డిస్తూ హల్వా వెంట తీసుకొచ్చాడు. అప్పటికే ఉప్పు కారం లేని కూరలతో భోజనం చేయలేక చప్పిడి భోజనం త్వరగా అయిపోతే బాగుండు అనుకుంటున్నాము . గిన్నెలో ముద్దగా ఉన్న హల్వా తినక తప్పదా అని ఫీల్ అవుతూ ఉన్నాము. “ఇది గుమ్మడికాయ, బెల్లం తో చేసిన హల్వా. చాలా బాగుంటుంది” స్వామీజీ మా ఇద్దరికీ హల్వా వడ్డించాడు . రుచి పచి లేని స్వీటు కానీ స్వీటు తింటూ స్వామీజీ గురించి ఆలోచించాను. అనగనగా ఒక స్వామీజీ . ఆయన భార్య పేరు అనసూయ . పతివ్రతా శిరోమణి పేరు గల ఆమె నిజంగా ఆ కోవ లోనిదే . ఆమె, స్వామీజీ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు . స్వామీజీ రూపం చాలా ఆకర్షణీయంగా ఉండేది. పచ్చటి పసిమి ఛాయ, నిగనిగ లాడే నల్లటి జుట్టు , ముఖాన్ని కప్పేసిన గడ్డం : ఇవి ఆయనకు ఒక సమ్మోహక శక్తిని ఇచ్చేవి. ధోవతి, కండువా ధరించేవాడు. తెలుగు, హిందీ, ఇంగ్షీషు అనర్గళంగా మాట్లాడేవాడు. మృదు సంభాషణతో ఆధ్యాత్మిక శక్తి గురించి మాట్లాడేవాడు. దీక్షను, ఏకాగ్రతను సాధించడానికి ఏమి చేయాలో , అనుభవంతో తెలుసుకున్నానని అది అందరికీ తెలియ చేయడానికి ప్రయత్నిస్తున్నానని అన్నాడు. స్వామీజీ భార్య అనసూయ ఆశ్రమం కార్యక్రమాల్లో పాల్గొనేది. అయితే అది ఆమెకు ఇష్టంతోనే అని చెప్పలేము.
భోజనాల తర్వాత, వేదాంత చర్చ పైన ఆసక్తి ఉన్న నా మిత్రుడు, “ స్వామీజీ, ఆద్యాత్మిక భావన ,తత్వ శోధన అంటే ఏమిటి? “ అని అడిగాడు. అలవాటైన విషయం కాబట్టి భారతీయ, విదేశీ వేదాంత ధోరణలు గురించి వివరంగా స్వామీజీ చెప్పాడు. నాగార్జున శూన్యవాదం, జ్యాక్విస్ దేరిడా deconstruction లకు ఉన్న సారూప్యం గురించి మాట్లాడుకున్నాము. విదేశీ సిద్ధాంతాల దాడిలో భారతీయ ఆలోచనలు ఎలా చితికిపోతున్నాయో స్వామీజీ వివరించాడు. “ పనిలో పనిగా తన ఆశ్రమం గురించి, తను ఏ ఆశయంతో ఆశ్రమం నిర్వహిస్తున్నాడో చెప్పాడు. “ఈ ఆశ్రమంలో వ్యక్తి కి సంపూర్ణమైన స్వేచ్చ ఉన్నది. ఎవరికి వారు కోరుకున్న రీతిలో వారి మార్గాన్ని సాధన చేయవచ్చు. బంధం అనేది మనిషికి yoke కాకూడదు .” స్వామీజీ ప్రియ వచనాలు పలికాడు. స్వామీజీ భక్తులకు దర్శనం ఇచ్చే సమయం అయ్యిందని గదిలోకి వెళ్ళాడు.గదిలో నేను, నా మిత్రుడు, స్వామీజీ భార్య మాత్రమే ఉన్నాము . ఆమె మాకు దూరంగా కూర్చున్నది. సంభాషణ కలపాలని “ ఎలా వుంది? ఉప్పులేని పప్పుచారు, ఉడకబెట్టిన పొట్లకాయ, సొరకాయముక్కలు , గుమ్మడికాయ హల్వా?” నవ్వుతూ నా మిత్రుడు అడిగాడు “ఆవుపాల పెరుగు మర్చిపోయావు “ అని అన్నాను నేను. “అయితే స్వామీజీ అన్నీ త్యజించాడా ? అని నేను అడిగాను “ ఆ విషయం నాకు తెలియదు ఒక వైపు నిలబడి చూస్తున్న అనసూయ వైపు చూపిస్తూ “ అదిగో ఆమెను చూడు .ఆమె అతని జీవిత భాగస్వామి , ఆమె చెప్పగలగాలి. స్వామీజీ సిద్దాంతాలకు , ఆలోచనకు ,ప్రయోగాలకు, నిదర్శనం . “ అనసూయకు, స్వామిజీకి, common ఫ్రెండ్ నా మిత్రుడు చెబుతూ పోయాడు. “తన ఆలోచనలు అమలు చేయడానికి స్వామీజీ ఎంచుకున్న మొదటి వ్యక్తి ఆమెనే. ఎవరికీ చెప్పుకోలేని విధంగా ఒక భక్తి పంజరంలో ఆమెను బంధీ చేశాడు. ఆయన జీవితంలో ఆమెను ఒక showpiece చేశాడు. శరీరాన్ని అదుపు చేయడానికి ,వాంఛలను అణగత్రొక్క డానికి అనసూయతో వంట మాన్పించాడు. తానే వంట చేస్తూ, ఆహారాన్ని, మితంగా, సాత్వికంగా, తీసుకోవాలని బోధించేవాడు. “ “ ఇదంతా ఎందుకంటావు ?” నేను అడిగాను. “ నీకు ఆ గదిలో భక్తులను, స్వామీజీ వారికి చెప్పే బోధనలు వింటే అర్ధమవుతుంది. యువతి యువకులకు ఆయన కౌన్సెలింగ్ చేస్తాడు. వారికి స్వేచ్చ , స్వాతంత్ర్యం గురించి చెబుతాడు . It is the power of delusion. A belief in one’s grandness and glory” స్వామీజీ తన చుట్టూ కోట కట్టుకోవడానికి శాస్త్రాన్ని, విజ్ఞానాన్ని, తర్కాన్ని ఉపయోగించుకుంటాడు. తనకు వ్యతిరేక భావాలను,జాగ్రత్తగా ఈ కోటలో బంధిస్తాడు. స్వామీజీ జీవితంలో అనసూయ అందమైన గాజు బొమ్మ . ఆ మార్గంలో పయనించడం ఆమెకు ఇస్టం లేదు. కానీ ఆమె తన అయిష్టతను ప్రదర్శించదు. అది ఒక ప్రేమ లేని జీవిత ప్రయాణం. “ “ ఇది తెలిసినా స్వామీజీ ఎందుకు ఆమెను ఇక్కడే ఉంచుతున్నాడు?అర్థం లేని జీవితాన్ని ఆమె మీద రుద్దినట్టు కాదా? ఇందులో ప్రేమ ఎక్కడ? “ నేను ఆశ్చర్య పోయాను. “ “ఉంది ప్రేమ ఉంది! స్వామీజీ ప్రేమిస్తున్నాడు . తనను తాను ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమలో మరింక ఏ ప్రేమ కూడా కనిపించదు” నా మిత్రుడు చెబుతున్నాడు. సంభాషణ వింటున్న అనసూయ ముఖంలో ఎలాంటి భావాలు నాకు కనపడలేదు.
పైకి గంభీరంగా, ఇతరులకు, సూక్తులు, సుఖ వచనాలు పలికే స్వామిజీ నిజ జీవితంలో ఎంత కారుణ్య రహితంగా, శుష్క మాటలు చెప్ప గలడో నాకు అర్దo కాలేదు.