Stories Sep 2025

ప్రేమ (కానని) కధలు — First Story

A beginning that lingers — between what is said and what remains unspoken.

ప్రేమ (కానని ) కధలు అనే సంపుటి రాస్తున్నాను. అందులో మొదటి కధ.

చిన్నతనంలో తెలియ లేదు కానీ ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే, అప్పటి ప్రేమ కధలు గుర్తుకొస్తాయి. ప్రేమ ఎప్పుడు ఎవరిని ఎలా కదిలించినా అది మా వీధిలో ఎక్కువ కాలం దాగేది కాదు. ప్రేమికుల మీద ఎప్పుడు నిఘా ఉండేది. వారిపట్ల ఆసక్తి ఎక్కువగా ఉండేది. మా ఎదురింట్లో ప్రమీల ఉండేది. వాళ్ళ నాన్నగారు మిఠాయిలు తయారుచేసేవారు. ప్రమీల 10వ తరగతి తర్వాత చదవడం ఆపేసింది. ప్రమీల అందం ఆమె కళ్ళల్లోనే ఉండేది. కళ్ళకు కాటుక పెట్టుకుని తలారబోసుకొని వీధి వాకిట్లో నిలబడితే వీధిలో తిరిగే అబ్బాయిలు ఆగి చూడాల్సిందే. ప్రమీల అన్యమనస్కంగా వీధి వాకిట్లోకి వచ్చినా ఎదురింట్లో అబ్బాయిలు కిటికీ చుట్టూ చేరి చూసేవారు. జులపాల step cuttingతో fashionable dressలు వేసుకునే శ్రీనివాస్, ప్రమీల వాళ్ళ ఇంటి మిద్ధే పైన ఉండేవాడు. క్రింద బట్టలు ఆరబెడుతూ, లేదా వడియాలు పెడుతూ ప్రమీల, పైన చదువుకుంటూ శ్రీనివాస్ ఒకరినొకరు కళ్ళతోనే పలకరించుకునేవారు. శ్రీనివాస్ కాలేజీకి వెళ్ళడానికి మెట్లు దిగేటప్పుడు, తిరిగి కాలేజీ నుంచి వచ్చినప్పుడు, ప్రమీల వాకిట్లో నిలబడి ఎదురుచూసేది. కొన్ని రోజులకి ప్రమీలకి శ్రీనివాస్ వార పత్రికలు పంపడం, అవి చదివి ప్రమీల తిరిగి ఇవ్వడం, ఆ పత్రికల్లో ఒకరికొకరు రాసుకున్న ప్రేమ లేఖలు, ప్రమీల తెలతెలవారి వేకువలో ముగ్గులు వేయడం, ఆ ముగ్గులను పై నుంచి శ్రీనివాస్ చూడడం, ఇలా వాళ్ళ ప్రేమ వృద్ధి చెందింది. శ్రీనివాస్ చదువు అంతంత మాత్రంగానే సాగేది. అతనిది ఒంగోలు దగ్గర ఏదో పల్లెటూరు అని చెప్పేవాడు. అంతగా కలిగిన కుటుంబం కాదు కానీ ఎప్పుడు stylish గా ఉండడానికి ప్రయత్నించే వాడు. సాయంత్రం వీధిలో పిల్లలు ఆడుకునే సమయంలో పెద్దలు కూడా బయటకు వచ్చేవారు. ఎండాకాలం ఇంట్లోని సెగని తప్పించుకోవడానికి బయట నీళ్ళు చల్లుకొని మంచాలు వేసుకుని కూర్చునేవారు. వేడిని కొద్దిగా మరపిస్తూ ఎక్కడ నుంచో ఒక సన్నటి గాలి వీచేది. ఆ గాలిలో మల్లెపూలు, సన్నజాజుల గుబాళింపు వచ్చేది. మల్లెపూలు, మరువం, కనకాంబరాలు కలిపి అమ్మాయిలు వాకిట్లో కూర్చుని మాలలు కట్టేవారు. అలాంటి సాయంత్రాల్లో ప్రమీల, శ్రీనివాస్ ల ప్రణయం చిగురించింది. ఒక రోజు ప్రమీల వాళ్ళ ఇంట్లో ఇద్దరి ప్రేమ విషయం తెలిసిపోయింది. శ్రీనివాస్ పుస్తకాలలో ప్రమీల ఫోటో, ఒకరి కొకరు ఇచ్చి పుచ్చుకున్న జాబులు అన్నీ బయట పడ్డాయి. ఈ విషయం మా వీధిలో అందరి ఇళ్ళల్లో టాపిక్ అయ్యింది. ప్రేమికులను ఎలాగైనా విడతీయాలి అనే ఉద్దేశ్యంతో ప్రమీల వాళ్ళ ఇంటిలో నుంచి శ్రీనివాస్ ను ఖాళీ చేయించారు. శ్రీనివాస్ వెనకాల వీధిలో చేరి పని లేకపోయినా రోజుకి నాలుగు సార్లు ఆ వీధిలో సైకిల్ మీద తిరిగే వాడు. ఇంటిలో నుంచి బయటకు రాకుండా కట్టడి చేస్తే ప్రమీల కిటికీ రెక్కల చాటు నుంచి అతని రాక పోకలను గమనించేది. ఆ విధంగా వారిద్దరూ ప్రేమ లోని విరహ అనుభూతిని అనుభవించారు. ప్రమీల కుటుంబం ఎంత కట్టడి చేయాలని ప్రయత్నం చేసినా ప్రేమికుల కలయిక ఏదో విధంగా జరుగుతూ ఉండేది. స్నేహితురాలి పెళ్ళికి ప్రమీల హాజరు అయినప్పుడు లేదా బుక్ లింక్స్ లో పుస్తకాలు తెచ్చుకున్నప్పుడు కలుసుకునేవారు. బుక్ లింక్స్ లోపల ఎదురు చూస్తున్న శ్రీనివాస్ ప్రమీల రాగానే వచ్చేసేవాడు. ఇంటిలో ఎందుకు ఆలస్యం అయిందని అడిగితే వార పత్రిక సంచిక చేతికి ఇవ్వలేదని కొత్త సీరియల్ అక్కడ నిలుచుని చదివేశాను అని చెప్పేది. ఇంటికి తెచ్చుకోవాలంటే రోజుకి ఒక రూపాయి అవుతుందని అందుకే తెచ్చుకోలేదని చెప్పేది. ఈ ప్రేమ కధకు ముగింపు ప్రమీల వాళ్ళ ఇంట్లో పెళ్లి సంబందాలు చూడడంతో జరిగినది. కానీ అందరూ అనుకున్నట్లు ప్రమీల ఎటువంటి బెదిరింపులు చేయలేదు. శ్రీనివాస్ తనను పెళ్లి చేసుకుంటాడని నింపాదిగా ఉండేది. పెళ్ళిచూపుల విషయం స్నేహితుల ద్వారా శ్రీనివాస్ కి ప్రమీల తెలియ చేసింది. శ్రీనివాస్ తప్పక వచ్చి తన తల్లి తండ్రులతో మాటలాడుతాడు అని ఆశించింది. కానీ శ్రీనివాస్ స్పందించలేదని ప్రమీలకు తెలిసింది. పెద్దవాళ్ళు అడిగితే timepass కోసం friendship చేశాను అని శ్రీనివాస్ చెప్పాడు. ఆ రాత్రి ఫ్యాన్ కి తాడు తగిలించుకో బోతున్న ప్రమీలను చూసి వాళ్ళ అమ్మ వెంటనే అందరినీ లేపింది. ప్రమీల మనస్సు అప్పటికి అర్థం చేసుకున్న తల్లితండ్రులు వెంటనే శ్రీనివాస్ మీద వత్తిడి తెచ్చారు. సరదా కోసం నడిపిన ప్రేమాయణం నుంచి చివరికి జీవితాంతం నిలవాల్సిన నిర్ణయం శ్రీనివాస్ తీసుకోవలిసి వచ్చింది. ఒక శుభ ముహూర్తంలో శ్రీనివాస్ ప్రమీలల వివాహం జరిగినది. సారూప్యతలు, భిన్న ప్రమేయాల నుంచి చిగురించిన వారి వివాహ బంధం ఎలా పరిణమిస్తుందో అని నేను ఆలోచించేవాడిని. శ్రీనివాస్ ఇంకొక అమ్మాయితో కూడా ప్రేమబంధం నడిపాడని ప్రమీలకి తెలిసినా ఆమె ఎలా అతనిని అంగీకరించింది అన్న సందేహం నాలో మిగిలిపోయింది. కాలం 5 సంవత్సరాలు తిరిగిపోయింది. ఒక రోజు వారిద్దరినీ ఇద్దరు పిల్లలతో బస్ స్టేషన్ లో చూడడం జరిగినది. వివాహ జీవితం ఎలా ఉందో అడుగుదామని అనిపించింది. మునుపటి శ్రీనివాస్ నాకు కనపడలేదు. జుట్టు బాగా తగ్గిపోయింది. కళ్ళద్దాలు వచ్చాయి. పొట్ట పెరిగింది. టిక్కెట్లు తేవడానికి లగేజ్ మార్చడానికి ఆపసోపాలు పడుతున్నాడు. బ్రతకడం లోని వేదన, జీవితం లోని సంఘర్షణ అతనిని బాగానే మార్చినట్టు తెలుస్తున్నది. ఇద్దరిలో తొలి ప్రేమల మధురిమలు మాయమైనట్లు అనిపించింది. వివాహం తర్వాత ప్రమీల లోని మెరుపు మాయమై మాతృత్వం లోని నిండుతనం వచ్చినట్లు అనిపించింది. అశాంతి నిండిన చూపులతో శ్రీనివాస్ ప్రపంచాన్ని పరికిస్తూ ఉంటే ప్రమీల మాత్రం పిల్లల అవసరాలు తీరుస్తూ ఉంది. ఒకరికోసం ఒకరు జీవిస్తున్నారా లేదా వివాహ బంధం అనే నాటకాన్ని రక్తి కట్టిస్తున్నారా అనే విషయం నాకు అర్థం కాలేదు. క్షణ కాలంలో తీసుకున్న నిర్ణయం ఎప్పటికీ తన జీవితంలో వెలితికి కారణం అని ప్రమీల గ్రహించింది అన్న విషయం తెలుసుకోగలిగాను. గల గల పారే సెలయేరు లాంటి ప్రమీల అనుభూతులన్ని గుండెల్లో నింపేసిన ఆనకట్ట లాగా అయ్యింది. ఇంటిలో ఆమె జీవితం తలుచుకుంటే ఇంకా దిగులు అనిపించింది. గడియారం ముల్లు లాగా ఆమె తిరిగి చేసే పని, సంసార బంధం, జీతాలు, లెక్కలు, స్కూల్ ఫీజులు. ఈ నిర్వేదం లోంచి ఎగిరిపోయిన మునుపటి మధురోహలు. ఎటువంటి భావాలు లేని సంబందం ప్రేమకు దారి తీయ వచ్చు కానీ ప్రేమతో మొదలు అయిన సంబందం ద్వేషానికి దారి తీసే పరిస్తితి ఎదురైతే, ఆ ద్వేషం తిరిగి ప్రేమలోకి దారి తీయడానికి కొన్ని దశాబ్దాలు పడుతుందేమో. నేను అలా ఆలోచిస్తూ ఉండగానే వాళ్ళు ఎక్కిన బస్ కదిలిపోయింది. బస్ లోంచి ప్రమీల నన్ను చూసినట్లు ఉంది. నవ్వుతూ నా వైపు చేయి ఊపింది. శ్రీనివాస్ మాత్రం ఎవరో తెలియదు అన్నట్లు ఉన్నాడు. బస్ వేగం పుంజుకొని దూరమైంది.

(ఈ కధలో పాత్రలు కల్పితాలు. కానీ నా అభిమాన రచయిత Gabriel Marquez ప్రభావం మాత్రం ఖచ్చితంగా ఉన్నది. ముఖ్యంగా ఆయన నవల Love in the Time of Cholera.)

Share Your Comments

I would love to hear your thoughts.