ఒకసారి వడ్డెర చండీదాస్ గారి ఇంటర్వ్యూ చదివాను. దాంట్లో ‘చివరకు మిగిలేది’ గురించి చండీదాస్ గారు ఏమి చెప్పారంటే: “నేను పుస్తకాలు చదవను. బుచ్చిబాబు ‘చివరకు మిగిలేది’ చదువుతాను. కాసేపు చదివి మానేస్తాను. మళ్లీ ఎప్పుడో, ఎక్కడో మధ్యలో చదవడం మొదలు పెడతాను.” చండీదాస్ గారిని అంతగా కట్టిపడేసిన ఆ నవలలోని అంతర్యం తెలుసుకోవాలని చదివాను. ఆ నవల నా దగ్గర చాలా రోజుల నుంచి ఉన్నా, అంతకు ముందు చదివిన గుర్తు లేదు.
రచయిత నవలలో జీవితాన్ని వివిధ కోణాల్లో స్పృశిస్తాడు. సమాజానికి, మనిషికీ మధ్య ఉండే అనుబంధం; వ్యక్తికీ, కుటుంబ సభ్యులకూ జరిగే సంఘర్షణ; పురుషుడికి, స్త్రీకి మధ్య ప్రేమ, ఆకర్షణ, వైరుధ్యం, సమ్మిళితం; మనిషికి, దేవుడికి మధ్య ఉండే బాంధవ్యం; వ్యక్తి, సామాజిక విలువలు, institutions మధ్య ఊగిసలాట. అన్నిటినీ మించిన తాత్విక చింతన, ప్రేమను, ఆత్మసౌందర్యాన్ని పొందటానికి, పొందలేకపోవటానికి, ఆనందానికి, విషాదానికి మధ్య భావవైరుధ్యం, సారూప్యం — ఇవన్నీ స్పృశించడం జరుగుతుంది. బుచ్చిబాబు తాత్విక విశ్వరూపం గోచరిస్తుంది. అంతటా హిపోక్రసిని, తెచ్చిపెట్టుకున్న నటనను, artificial behaviorని వదలి స్వతంత్రంగా, స్వచ్ఛంగా స్పందించగలిగే, కలగాలని తాపత్రయపడే వ్యక్తి — దయానిధి — అగుపిస్తాడు. ఎంతో truthfulగా, spontaneousగా వ్రాసినట్లు అనిపించినా, నవల సత్యాన్వేషణే కాబట్టి, సత్యాన్వేషణలో రచయిత సత్యానికి, సౌందర్యానికి అతి చేరువలో ఉంటాడు కాబట్టి, రచయిత తన కథను పటిష్టంగా నిర్మించాడు. దయానిధి జీవితం, దాని గమ్యం, సమాజం కోసం తన ఆలోచనను చంపుకునే మనిషి మార్గం, సర్దుకుపోవడం అనేది తెలియని వాలకం, సౌందర్య ఆరాధన, తత్వశోధన, అన్వేషణ, సమాజంచే దూషణ — ఇది దయానిధి జీవితం.
మనిషి ఎందుకు ద్వేషిస్తాడు? తనకు ఏం కావాలో తెలియనందువలనే మనిషి ద్వేషిస్తాడు. మనిషి ఎందులో ఆనందం పొందుతాడు? అన్వేషణలో. ప్రియుడు, ప్రియురాలి ప్రేమలోని ఆనందాన్ని పెళ్లి అయ్యేంత వరకే ఆనందిస్తాడు. పెళ్లి తర్వాత ఒకరినొకరు తెలుసుకుంటారు. అన్వేషణ అంతమొందుతుంది. కోమలి, సుశీల, అమృతం, నాగమణి, ఇందిర, సరళ, రోజ్, కాత్యాయిని, జగన్నాధం, శ్రీనివాసరావు, రాజభూషణం, కాంతారావు, మాధవయ్య — వీరందరూ పాత్రలు అనడమే ఔచిత్యమేమో. వీరు మనుషులే, వ్యక్తిగత భావజాలం, idiosyncrasies ఉన్నవారే. కాని వీరందరి పై దయానిధి వ్యక్తిత్వం, అతని ఆలోచనా సముద్రంలోని ఒక్కొక్క చింతన, ఒక్కొక్క తపన ప్రసరిస్తూ ఉంది. అయితే దయానిధేనా నవలంతా అంటే, కాదు.
అసలు నవలలో ఏదీ లేదు. ఏది లేకుండా ప్రారంభమై, చేతిలో డబ్బులేక సర్కస్ చూడలేడు నిధి. అన్నీ సంపాదించి, అన్నీ పోగొట్టుకుని చివరకు మిగిలేది శూన్యమని తేలుస్తాడు రచయిత. జీవితానికి అర్థం లేదని తేల్చేస్తాడు. రచయిత కథాగమనాన్ని నియంత్రించడం అనేది జరగదు. వైవిధ్యమైన పాత్రలు వివిధ హావభావాలు ప్రదర్శిస్తాయి. వేదాంతాన్ని తృణీకరించి అందర్నీ కించపరిచే రాజభూషణం పెద్ద egotistగా, misanthropeగా కనిపిస్తాడు. వ్యంగ్యంగా, విచిత్రంగా మాట్లాడే జగన్నాధం సర్దుకుపోలేక mainstreamలోంచి వైదొలిగి ఆశ్రమ జీవనం ఎంచుకుంటాడు. దయానిధి concept of love untainted by sexual indulgence, ఎంతటి విపత్తునైనా స్వీకరించగలిగే మనస్సు, వ్యక్తిని వ్యక్తిగా స్వీకరించగలగడం — దయానిధి తల్లి దయానిధిలో ప్రేమ అనే గుణాన్ని దిద్దినట్లు అనిపిస్తుంది.
‘చివరకు మిగిలేది’ ఏ ఇజంకు అందుతుంది? Rationalism, fatalism, realism, nihilism, individualism, surrealism, humanism — అనేది నాకు అంతుచిక్కలేదు. ఆలోచించగా నాకు ఈ నవల ఒక reflexive dialogue అనిపించింది. It is the angst of the novelist which the novel unconsciously foregrounds. By angst I mean the perplexing situation, the perpetual human misery or predicament. నవలలో నాకు నచ్చిన మరొక అంశం రచయిత కొన్ని సందర్భాలలో చేసిన వర్ణన. దయానిధి కోమలిని సమీపించి ఉద్వేగంతో దగ్గరకు తీసుకోవాలని అనుకున్న క్షణాలలో చెరువులోని చేప పిల్లలు కదలినప్పుడు పరుచుకున్నటువంటి పరిమళం అతన్ని ఆవరించడం; దయానిధి అమృతం వాళ్ల ఊరికి వెళ్లి రాత్రి ఆరుబయట అరుగు మీద బస చేయటం; జీవితానికి అర్థం ఉందా అన్నదానికి మేస్టారు పంపే సమాధానం.
దయానిధి ఒక హీరో కాదు, తనలోని మృగాన్ని, అనైతికతను తొక్కిపెట్టే హిపోక్రైట్ కాదు. కృత్రిమ విలువలకు అతను బందీ కాడు. మనిషిగా వాంఛకు తను బానిసేనని అతను నిరూపిస్తాడు; He is not a saint. ‘చివరకు మిగిలేది’కి చారిత్రక, భౌతిక, స్థితి కాలగతులు లేవు. ఈ తపన, ఈ శోధన, ఈ నిరంతర సృజన ఒక eternal ప్రక్రియ. ఆలోచన ఉన్నంత వరకు, వైరుధ్యం ఉన్నంత వరకు ఇది జరుగుతుంది.