నవలా సాహిత్యం ద్వారా వాస్తవికతను, రచయిత దృక్పధాన్ని ప్రపంచానికి తెలియచెప్పగలిగే అవకాశం Harriet Beecher Stowe లాంటి రచయితలకు లభించింది. సాహితీ ప్రక్రియలో నవల ఆగమనం రచయితల హృదయ స్పందన, సృజన, విషయం, సామాజిక సమస్యల పట్ల ప్రతిస్పందిస్తున్న తీరును, దాని చిత్రీకరణను వేగవంతం చేసింది. Drama యెక్క Dramatic effect, High Powered Impact వలన కొంత మంది ఉదా: Ibsen, Ionesco, Beckett, Brecht, Tennessee Williams, JM Synge, Anton Chekhov, Pirandello, లాంటి రచయితలు 20వ శతాబ్దంలో కూడా ఎన్నో అద్వితీయమైన రచనలు చేసారు. Ibsen రాసిన A Doll’s House, Brecht రాసిన Mother Courage, Beckett రాసిన Waiting for Godot లాంటి రచనలు ప్రపంచ సాహిత్యంలో ఒక నూతన ఒరవడిని సృష్టించాయి. Ibsen “A Doll’s House “లో realism, modernism ను, Mother Courage లో Brecht Alienation అంశాన్ని, Waiting for Godot లో Beckett ‘Theatre of the Absurd’ ఆలోచనా సరళిని ప్రపంచానికి పరిచయం చేశారు.
కాని ప్రస్తావించ తలచిన అంశం నవల యొక్క విశ్వజనీనత మరియు బహుముఖ, బహు అంశాల నేపధ్యం. ఉదా: 1852 లో అమెరికాలో ప్రచురితమైన Uncle Tom’s Cabinకు, 1850 లో Britain లో ప్రచురితమయ్యిన David Copperfieldకు, అలాగే 1847లో ప్రచురించబడిన Wuthering Heightsకు ఏమైనా సారూప్యత ఉన్నదా? 5 సంవత్సరాల కాల వ్యవధిలో వచ్చిన ఈ మూడు నవలలు ఎంతో భిన్నమైనవి. Uncle Tom’s Cabin ఒక సామాజిక నవల, a social indictment, తెల్లవారి దురహంకారంపై ఎక్కుపెట్టిన ఒక సాహిత్య పోరాటం లేదా సామాజిక గ్రంథం. దీనిలో realism, వాస్తవికత పాలు ఎక్కువ. Wuthering Heights లాంటి నవల మరొకసారి, మరొకరిచే రాయబడలేదేమో! ఆంగ్ల సాహిత్యంలో అనంతమైన కీర్తిని సాధించిన Bronte Sisters, Emily, Charlotte, Anne Bronte లో ఒకరైన Emily Bronteచే రచించబడిన ఈ Gothic Love Story (భయానక, ప్రణయ గాధ ) Romantic and Gothic Love Story లలో అపురూపమైనదిగా పేర్కొనవచ్చు. Emily రాసినది ఒకే ఓక నవల. దురదృష్టవశాత్తు Bronte Family లోని సభ్యులందరూ చిన్న వయసులోనే Consumption (TB) తో మరణించడం సాహితీలోకానికి తీరని లోటు చేసింది. Catherine, Heathcliffల గగుర్పాటు గొలిపే Gothic Romance కు యిప్పటికీ పాఠకులు జేజేలు పలుకుతున్నారు. Charlotte Bronte రాసిన Jane Eyre నవల కూడా Gothic Romance కోవలోకే వస్తుంది. Elizabeth Gaskell రాసిన “The Life of Charlotte Bronte”లో Bronte Sisters జీవితంలోని వ్యధ, శోకం, కుటుంబ నేపథ్యం, Yorkshire Moors ద్వారా వారు పొందిన ప్రేరణ, ముంచుకొస్తున్న వ్యాధితో నైరాశ్యం, కఠినమైన ఛాందస పెంపకం, వారి పేదరికం గురించి మనం తెలుసుకోవచ్చు.
1850లో రచించబడిన David Copperfield, నవలాకారుడు Charles Dickens స్వీయ చరిత్రకు దగ్గిరగా ఉన్నట్లు అనిపిస్తుంది. Bildungsroman కోవలోకి వచ్చే ఈ నవల, చిన్నతనం లోనే తన తండ్రిని కోల్పోయిన David Copperfield, తన పెంపుడు తండ్రి, తన అమాయకపు తల్లి పెంపకం నుంచి బయటపడి Peggotty కుటుంబంతో జీవించడం నుంచి మొదలవుతుంది. Dickens ఆత్మకథ అనేందుకు నిదర్శనంగా, ఈ నవల మొత్తం First Personలో రచించబడింది. Bildungsroman అన్న ప్రత్యేకమైన (novelistic technique) నవల లోని ముఖ్యనాయకుడు లేదా నాయిక యొక్క జీవన ప్రయాణం, భౌతిక, మానసిక, సైద్ధాంతిక ఎదుగుదల, మార్పును చిత్రీకరిస్తుంది. ఈ ప్రయాణంలో వారు ఎదుర్కొన్న కష్టాలు, వివిధ ఘట్టాలు, వారి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దిన సన్నివేశాలు, సంఘటనలు, పాఠకులు గమనించవచ్చు. వ్యక్తి, అనుభవాల సారాంశంగా Bildungsromanను చెప్పుకోవచ్చు. ఈ మూడు నవలలను ఉదహరించడంలోని ఉద్దేశ్యం: సమకాలీన పరిస్థితుల్లోనే రచించినా, నవల యొక్క భిన్నత్వానికి యివి ఉదాహరణలుగా మనం భావించవచ్చు.
నవల యొక్క విస్తృతత్వాన్ని నిర్వచించడానికి, ఈనాడు రాయబడుతున్న నవలల సంఖ్యను చూప వచ్చు. మనిషి యొక్క సాంఘిక, మానసిక భావోధ్వేగాలను తెలియజేయడానికి నవల అన్నిటికంటే అత్యుత్తమ సాధనంగా రూపొందిందిదని మనం చెప్పుకోవచ్చు. మధ్యయుగాల నుంచి, ఆధునిక యుగానికి మానవ జీవితం మార్పు చెందుతున్న కాలంలో, యధార్థాన్ని, కల్పనను, పురాణేతిహాసాలును, వాస్తవికతను సమన్వయం చేయడానికి సాహితీకారులు చేసిన ప్రయత్నంగా నవలను విమర్శకులు అభిప్రాయపడుతున్నారు.
నవల మూలాలను శోధిస్తే, కథ, చరిత్ర, పురాణం మనకు గోచరిస్తాయి. పురాణాలుగా మనం భావిస్తున్న మహాభారతం, రామాయణం, నవలగా అనుకూలించవా? Homer రాసిన Iliad, Odysseyలు నవలలుగా మార్చి చదివితే ఆసక్తి కల్గిస్తాయా అంటే అవును అనాలి; కథ, యితిహాసం, నవలలోని సర్వజనీన అంశం, సంఘర్షణ, వ్యక్తిత్వచిత్రణ, సాహసయాత్ర, కథనంలో ఒడిదుడుకులు (Plot twists) సమాజ విశ్లేషణ, నీతి, మరియు పాఠకులకు కావలసిన ఆసక్తి, ఈ గ్రంథాలలో కూడా సమగ్రంగా ఉన్నది. కాబట్టి నవల యొక్క మూలాలు Narrative, Tale, Epic లో ఉన్నాయని తెలుసుకోవచ్చు.
ఆసక్తి కల్గించని జిగి బిగి, మలుపులు, కుదుపులు లేనిదే అది నవల కాదా? Joseph Heller రాసిన Catch-22, Vladimir Nabokov రాసిన Lolita, Umberto Eco రాసిన Foucault’s Pendulum వంటి నవలలకు కథను ఆపాదించగలమా? సాంప్రదాయ కథ అనేది లేనంత మాత్రాన అవి నవలలు అనిపించుకోవా? Gabriel Márquez రచన Autumn of the Patriarch, Milan Kundera రచన The Unbearable Lightness of Being లాంటి నవలలలో సాంప్రదాయ పద్ధతిలో చెప్పబడే కథను మనం చూడలేము. Chronological vs Psychological time మధ్య తను చెప్పదలచుకున్న విషయాన్ని చేరవేయడానికి రచయిత ఎంచుకునే కథా విధానం ఆధునిక సాహిత్యంలో ఎన్నో అద్భుత ప్రక్రియలు (Narrative devices) కు దారి చూపించింది.
20వ శతాబ్దపు అత్యుత్తమ నవలలలో ఒకటిగా పరిగణించబడుతున్న James Joyce రచన ‘Ulysses’ కధా నాయకుడు డబ్లిన్ మహా నగరంలో 24 గంటల్లో అనుభవించిన విషయాలు స్వీయ అనుభూతి విధానంలో Stream of Consciousness ద్వారా మనకు చేరవేస్తుంది. ట్రోజన్ యుద్ధం తర్వాత, సహచరులను కోల్పోయిన Ulysses వలె, ఈ నవలలో Leopold Bloom మనకు అగుపిస్తాడు.
ట్రోజన్ యుద్ధవీరుడు Ulysses ఎన్నో సంవత్సరాల సుదీర్ఘ పోరాటం ముగింపుకు వచ్చిన తర్వాత, యుద్ధంలో అస్తమించగా మిగిలిన కొంతమంది వీరులతో కలిసి తన రాజ్యానికి తిరుగు ప్రయాణం చేస్తాడు. ఈ ప్రయాణంలోని సాహస యాత్రలను, అనుభవాలను, Homer Odyssey అనే గ్రీకు పురాణంలో పొందుపరిచాడు. అలనాటి Ulyssesకు మరొక పేరు Odysseus అనగా సాహస యాత్రికుడు. James Joyce ఈ epic qualities, పురాణ లక్షణాలను ఆపాదించుకుంటూ, 24 గంటల సమయంలో డబ్లిన్ మహానగరంలో సంచరిస్తున్న నాయకుడు Leopold Bloom ఆత్మానుభావాన్ని, అనుభూతిని మహా గ్రంధ రూపంలో Ulysses అనే నవలగా వెలువరించాడు. ఈ నవలలో James Joyce ఎన్నో రకాల సాహిత్య ప్రక్రియలను, విశేషాలను పొందుపరిచాడు. సాధారణ, దైనందిన అనుభవాలకు, అనుభూతికి తన విశ్లేషణ, సాహిత్య, చారిత్రక, తార్కిక, వైశేషిక స్పృహతో విశిష్టత కల్గించడం ఈ నవలలో చూడవచ్చు.
నవల యొక్క (Content) కధ ఎంత ప్రాధాన్యత కలదో, దాని యొక్క (Form) స్వరూపం కూడా అంతే ముఖ్యమైనదిగా మనం భావించవచ్చు. నవల చాలా చిన్నది కావచ్చు. F. Scott Fitzgerald రాసిన Great Gatsby లేదా J. D Salinger రాసిన Catcher in the Rye లాగా తక్కువ నిడివి గలది కావచ్చు. Leo Tolstoy War and Peace లేదా Mikhail Sholokhov, And Quiet Flows the Don లాగా పెద్ద నవల కావచ్చు.
సాధారణ కధా విధానంలో linearity ఉంటుంది. ఉదా: Great Expectations, Charles Dickens చే రచించబడిన ఈ Bildungsroman లో పసితనం నుంచి యుక్తవయస్సు వరకు Pip అనే అబ్బాయి జీవిత ప్రయాణం మనం చూడవచ్చు. కాల గమనంతో పాటు కధానాయకుడి జీవితంలో ఏర్పడే మార్పులు, శరవేగంగా ఏర్పడే పరిణామాలు అతనిని ఒక అదృష్ట జాతకుని చేస్తాయి. ఒక అపారమైన సంపదకు అతను వారసుడు కాబోతున్నాడని తెలియజేస్తాయి. కానీ అతనిని ఈ విధంగా చేరదీస్తున్న దెవరో అతనికి తెలియదు. Miss Havisham అనే అభిప్రాయంతో అతను ఉంటాడు. ఆమె పెంపుడు కూతురు Estellaతో ప్రేమలో పడతాడు. నడిమంత్రపు సిరి మాయలో పడి మానవ సంబంధాల విలువను మర్చిపోయి తనను పెంచి పోషించిన కుటుంబాన్ని మరచిపోతాడు. చివరికి ఒక నేరస్థుడి అభిమానానికి (చిన్నతనంలో సహాయం చేయడం వలన) పాత్రుడినైనానని గ్రహించి తన అహంకారాన్ని కోల్పోతాడు. అతనిని కోల్పోయి, అతని ద్వారా వచ్చిన సిరినీ కోల్పోయి చివరికి తను బయల్దేరిన చోటికే చేరుతాడు. అయితే అతను యిప్పుడు వ్యక్తిత్వ సంపన్నుడైనాడు. జీవిత సంఘర్షణలో, సత్యాన్వేషణ చేసి కడిగిన ముత్యం వలె బయటకు వచ్చాడు.
ఈ విధంగా పైన ఉదహరించిన నవలలలో, form and content రెండూ సమాంతరంగా ఉన్నాయి. Alexandre Dumas రచన The Count of Monte Cristo లో కూడా మనం యిలాంటి కధా విధానం చూడవచ్చు. అమాయకత్వం వలన మోసం చేయబడిన Edmond Dantes, Chateaud’if కారాగారంలో Father Faria పరిచయంలో ప్రాపంచిక విషయాలతో బాటు నిధిని గురించి తెలుసుకుని తనకు అన్యాయం చేసిన ముగ్గురిపై ఎలా పగ తీర్చుకున్నాడో మనం చూడవచ్చు. పై రెండు నవలల లో కధానాయకుడు Crisis point ను ఎదుర్కొంటాడు. W. H Hudson రాసిన గ్రంధం, Introduction to the Study of Literature లో కధ, నాటకం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలియచేస్తారు. Plotకు ఈ విధమైన నిర్వచనం మనం చూడవచ్చు.
Rising Action ——— Crisis———-Falling Action అన్నది త్రిభుజ ఆకారంలో ఉంటుందని సూచించారు
ఈ విధంగా కధా గమనంలో జరిగే పరిణామాలు కధలో సంక్లిష్టతను పెంచుతాయి. అత్యంత కీలకమైన పరిణామం సంభవించినపుడు, కధానాయకుడు లేదా కథానాయిక జీవితంలో ఒక ముఖ్యమైన సంఘటన సంభవిస్తుంది. ఉదా: Jane Eyre నవలలో తాను పెళ్ళాడదల్చుకున్న Edward Rochesterకు యిదివరకే పెళ్ళి అయ్యిందని Jane తెలుసుకోవడం లేదా Pride and Prejudice నవలలో Mr. Darcy యిచ్చే మొదటి వివాహ ప్రతిపాదనను Elizabeth త్రోసిపుచ్చడం. ఈ Crisis లేదా సంక్లిష్టత, నవల ఆశావహ ఆలోచనలతో ముగింపబడేదైతే, అన్నిసమస్యలు ఒకటొకటిగా పరిష్కరించబడి కధ సుఖాంతమవుతుంది. Mark Twain నవల The Adventures of Tom Sawyer లాగా. అదే ఆ నవల దుఃఖాంతం అయ్యేటట్లయితే, ఈ సమస్యలు మరింత జటిలమయ్యి నాయిక లేదా నాయకుడి లేదా యిద్దరి మరణానికి దారి తీస్తాయి.
ఉదా: Tess of the d’Urbervilles
Crisis point లేదా సంక్లిష్టత అనేది కధలో ఎప్పుడు సంభవిస్తున్నదో మనం సూటిగా చెప్పలేము. సాధారణంగా నవలాకారులు ఎంచుకునే narrative technique, కథాశిల్పం, శైలి పై ఇది ఆధారపడి ఉంటుంది. ఆధునిక modern, post – modern నవలలలో శైలి, శిల్పం, కధ మధ్య హద్దులు చెరిగిపోవడం మనం ఒక ప్రత్యేకతగా గమనించవచ్చు. ఆ సందర్భాలలో form and content – కథా శిల్పానికి, కధకు మధ్య ఉన్న వ్యత్యాసం (మనం విశ్లేషించుకునేందుకు ఏర్పర్చుకున్న సాధనంగా) అస్పష్టమవుతుంది. ఆయా సందర్భాలలో రచయిత రాసిన విధానమే తన నవలను మరింత ప్రభావవంతంగా చేస్తుందని భావించవచ్చు. ఈ విధమైన శైలి కధలోని అనిశ్చితిని, గాఢతను సూచిస్తుంది. మనస్సు, మేథస్సు ప్రతి క్షణం వందల వేల interactionsకు లోనవుతున్నప్పుడు రచయిత సమాంతరంగా, నేరుగా కొనసాగే story/ plotను ఉపయోగించడం సమంజసమ వుతుందా? యిది యధార్థ జీవితంలోని కల్లోలానికి, విభ్రాంతికి, అనిశ్చితికి వ్యతిరేకంగా సృజించిన ఒక అసహజమైన వ్యవస్థ కాదా? ఆధునిక నవలాకారులు ఈ అనిశ్చితిని, జీవితంలోని మెరుపును, క్షణకాలంలో మనస్సు నుంచి జాలువారి, అదృశ్యమయ్యి, తిరిగి ప్రత్యక్షమయ్యే భావాలను ఒడిసి పట్టుకోవడానికి విభిన్న మార్గాలను ఎంచుకున్నారు. చాలా సందర్భాలలో form, plotను నిర్దేశించవచ్చు. ఈ formనే కధగా మనం చూడవచ్చు. అస్తవ్యస్త విధానంలో కథ చెప్పడం లోపం కాక సృజనాత్మకత వెల్లివిరియడానికి ఒక సాధనంగా చూడవచ్చు.
Toni Morrison రచించిన ‘Beloved’, Gunter Grass రచించిన The Tin Drum, Orhan Pamuk రచన The Black Book, Ralph Ellison రచన The Invisible Man, Gabriel Marquez రచన One Hundred Years of Solitude, Arundathi Roy రచన The God of Small Things, William Faulkner రచనలు The Sound and the Fury, Absalom Absalomలలో ఇది మనం చూడవచ్చు.
నవలాకారుడి ప్రత్యేకమైన సృజన, అనుభూతిని పాఠకులకు తెలియజేయడానికి విస్తృత పరిథి కల్గిన literary genre నవల అని ఈ రచనలు నిరూపిస్తున్నాయి. 100 Years of Solitude లేదా 100 సంవత్సరాల ఏకాంతం అనే నవల నేను 1991 లో చదవడం జరిగింది. మా classmate A. V. Thampan కేరళకు చెందిన వ్యక్తి. నా సహాధ్యాయి ఒక స్కూలు టీచరు. మేమందరం CIEFL( Central Institute of English and Foreign Languages) లో PGDTE – Diploma in Teaching English చదువుతున్నపుడు, A. V. Thampan నన్ను ఈ నవల చదవమని ప్రొత్సహించి తన కాపీని నాకిచ్చారు. ఈ నవలను నేను సుమారు 72 గంటల్లో చదివినట్లుగా జ్ఞాపకం ఉన్నది. (కేరళ రాష్ట్రం సైద్ధాంతికంగా, సాంస్కృతికంగా ఎంతగా పురోగమించి ఉన్నదో దాన్ని బట్టి నేను అర్ధం చేసుకున్నాను.)
Gabriel Marquez అత్యద్భుత శైలి, magical realism, అధివాస్తవికతకు చేరువగా ఉంటూ లాటిన్ అమెరికా ఆత్మను ప్రతిబింబిస్తూ రాసిన ఈ నవల నన్ను కదిలించింది. 7 తరాల Buendia కుటుంబ జీవిత చరిత్ర Marquez తన ఊహాజనిత ఊరు Macondo ఆధారంగా సృష్టించారు. ఈ నవల గురించి ప్రాచుర్యంలో ఉన్న కథ. ఒక రోజు కారు ప్రయాణంలో Marquezకు వచ్చిన ఆలోచనల ఒరవడి అతనిని చలింప చేసింది. తన స్వంత ప్రాంతం Columbia లోని Aracatacaలో తన చిన్ననాటి అనుభవాలను, Colonel Buendia పాత్రకు స్ఫూర్తిని మనసులో నిలుపుకుని తన యింట్లో కొన్ని కాగితాల కట్టలతో Marquez రాయడం మొదలుపెట్టాడు. యిల్లు గడపడానికి Mercedes (Mrs Marquez)ఎలాగో తంటాలు పడుతూ, చివరికి కారు కూడా అమ్మి ఆయనకి ఆహారం, కాఫీ, సిగిరెట్లు లోపలికి పంపేది. కొన్ని నెలల తర్వాత Marquez తన చేతిలో నవల ప్రతితో బయటకు వచ్చాడని, రూము నిండుగా పొగాకు పొగ అలుముకుని ఉన్నదని అంటారు.
ఈ కధ వెనుక నిజమేదైనా, ప్రపంచ సాహిత్య చరిత్రలో ఒక అద్భుత రచనకు ప్రాణం పోయడంలో Gabriel Marquez విజయం సాధించాడని చెప్పవచ్చు. విమర్శకులు Bible లోని Genesis తర్వాత ప్రతి ఒక్కరు తప్పక చదవవలసిన పుస్తకంగా దీనిని అభివర్ణించారు. లాటిన్ అమెరికా యొక్క అస్థిత్వానికి ప్రతీకగా, సంస్కృతి, జానపదం, విశ్వాసం, హింస, అయోమయం లాంటివన్నీ కలగలిసిన Latin America ఆత్మగాను ఈ నవలను అభివర్ణించారు. తర్వాత కాలంలో ఈ ప్రత్యేకమైన శైలి ఎంతో మందిని ఆకట్టుకున్నది. Isabel Allende నవల, The House of Spirits, Mario Vargas Llosa నవల The feast of the Goat లో కూడా ఇది గమనించవచ్చు. నవల పరిధిని ఈ విధంగా Marquez విస్తరించడం జరిగింది. తర్వాత కాలంలో ఆయన చేసిన రచనలు యింకా ప్రభావవంతంగా, నవల యొక్క భిన్నత్వాన్ని, ప్రాధాన్యతను పెంచేందుకు దోహదపడే విధంగా ఉన్నాయి.
Latin America జీవితాన్ని, అందులోని వైవిధ్యాన్ని, లాలిత్యాన్నీ Gabriel Marquez నవలల ద్వారా అనుభవించడం ప్రారంభించాను. Love in the time of Cholera, Of Love and Other Demons, No one writes to the Colonel, Autumn of the Patriarch, Chronicle of a Death Foretold, Living to tell the Tale (an autobiography), పుస్తకాలన్నీ వరుసగా చదివాను. యిటీవల అయన Journalist గా ఉన్న కాలంలో రాసిన పత్రికా రచనలు The Scandal of the Century and Other Writings చదివాను. కధ ఏదైనా, కధా వస్తువును Marquez స్పృశించే తీరు ఇతర రచయితలకు వీలు పడదేమో అనిపిస్తుంది. ఆయన మనo సామాన్యంగా పరికించే వస్తువులను, దృశ్యాలను, విభ్రాంతితో, సమ్మోహన దృష్టితో పరికిస్తాడేమో అనిపిస్తుంది. అందుకే Marcel Proust అన్నట్లు “The real voyage of discovery consists not in seeking new landscapes, but in having new eyes.”
Marquez ధరించిన ఈ సరిక్రొత్త vision ద్వారా నవలా రచనలో ‘magical realism ‘ అనే ఒరవడి ప్రారంభమయ్యింది. అదివరకే ఈ శైలి పలు రచనల్లో ప్రయోగించబడినా, Marquez శైలి లోని magical realism (తెలుగులో దీనిని సమ్మోహన వాస్తవికత అని అంటాను) సాహితీ ప్రేమికులను ఒక కుదుపు కుదిపింది. ఘనీభవించిన నీరు చూడడానికి తనను తన తండ్రి తీసుకు వెళ్ళిన సందర్భంతో మొదలయ్యే 100 సంవత్సరాల ఏకాంతం నవల, ఊహాజనిత Macondo పట్టణంలోని Buendía కుటుంబ చరిత్రను, దక్షిణ అమెరికా నాగరికత, సంస్కృతి, చరిత్ర, ఆత్మకు ఉపమానంగా మనకు చూపుతుంది. ప్రేమలోని ఔన్నత్యాన్ని, ప్రేమ రాహిత్యపు బాధను, వాంఛ, స్వేచ్ఛ, కాలం, కాలహరణం, జీవిత పరిభ్రమణం అనే పలు అంశాలు మహోన్నతంగా ఈ నవలలో ఆవిష్కరించబడ్డాయి. ప్రస్తుతంలోని భారాన్ని, కదులుతున్న గడియారపు ముల్లులోని అద్భుత, భయానక స్వేచ్చానుభూతిని ఒడిసి పట్టుకునే ప్రయత్నం ఈ నవలలో కనబడుతుంది. Beckett లేదా Ionescoల రచనల లోని Absurd Element Marquez నవలల్లో మనకు కనబడదు. ఎందుచేతనంటే జీవితాన్ని ప్రేమించే కవి, కాంతి తిమిరాల సమ్మేళనాన్ని ప్రేమించే తత్వవేత్త Marquez లో ఉన్నాడు.
Gabriel Marquez సృష్టించిన సమ్మోహన వాస్తవ లోకం నాలోని దృక్కోణాన్ని విభిన్నమైన రీతిలో ఉత్తేజపరిచింది. కొన్ని సందర్భాలలో ఆయన రచనలు గుర్తుకు వచ్చినపుడు నేను సాధారణమైనవిగా ఊహించుకునే దృశ్యాలు కొత్త రంగులో, రూపులో దర్శనమిచ్చేవి. ఒక రోజు విజయవాడ బందరు కాలువ ప్రక్కనే నేను నడుస్తున్నప్పుడు కాలువ ప్రక్కనే కుర్చీలో కూర్చున్న ఒక వ్యక్తికి యింకొక వ్యక్తి సున్నితంగా, సుతారంగా క్షవరంచేస్తూ ఉన్నాడు. ఆ సమయంలో అతను మెడ వరకూ తెల్లటి టవలు ధరించి, మొహం పైన తెల్లటి షేవింగు నురుగుతో ఉన్నాడు. నాకు ఆశ్చర్యం కల్గించిన విషయం, బందరు కాలువకు కేవలం పదడుగుల దూరంలో విపరీతమైన రణగొణ ధ్వనులతో ట్రాఫిక్ అంతా కదిలిపోతూ ఉంది. వాహనదారులు హడావిడిగా కదులుతున్నారు. అందరిలో ఆందోళన, గమ్యం చేరుకోవాలనే ఆత్రుత కనబడుతోంది. ఈ యిద్దరు వ్యక్తులు మాత్రం ఎవరితో నిమిత్తం లేని విధంగా, వారి పనిలో నిమగ్నమయ్యారు. కనీసం కన్నెత్తి కూడ అవతల చూడలేదు. నేను కూడా ఒక్క నిమిషం పాటు ఈ దృశ్యాన్నిచూస్తూ పరిసరాలను మర్చిపోయాను. నా మనో ఫలకం మీద వాళ్ళిద్దరే కనపడ్డారు. చుట్టూ అందరూ మాయమైనారు. Marquezను చదవకపోతే నాకలాంటి అనుభూతి దొరికేది కాదు. క్షణంలోని అనంతాన్ని అలా దర్శించవచ్చు.
“To see a world in a grain of sand
And heaven in a wild flower,
To hold infinity in the palm of your hand
And eternity in an hour.”- William Blake
S. T Coleridge రచన The Rime of the Ancient Mariner లో లాగా“The Mariner he holds the wedding guest with his glittering eye.” Marquez రచన ప్రారంభించిన తర్వాత అది పాఠకులను చేర్చే తీరాలు వారి స్వానుభవంలోనే తెలుసుకోవాలి. Marquez యింకొక రచన Love in the time of Cholera. Love, ప్రేమ అనే అనుభూతిపై Marquez తన భావాలను, తన నవలల ద్వారా విస్తృతంగా వ్యక్తపరిచారు. Marquez నవలలలో ప్రేమ కాంక్షతో కూడుకున్నది. కోరికతో బలీయమైన ఈ ప్రేమ దేనికైనా తెగిస్తుంది. ఎంత వరకైనా పోరాడుతుంది. 100 Years of Solitudeలో ప్రేమాస్వాదనలో, అన్నా చెల్లెలు అసహజ శృంగార బంధంలో అనైతికం అయినా వెరువక మునిగిపోతారు. Of Love and Other Demons లో ప్రేమ రూపం తెలియని Bishop Delaura, దెయ్యం పట్టిందని బంధింపబడిన అప్సరస కన్య Servia Maria కోసం తన సర్వం వదులుకోవడం, 6 దశాబ్దాలుగా తను ప్రేమించిన స్త్రీ Fermina Daza కోసం, జీవితాంతం Florentina Ariza ఎదురుచూడడం (మధ్యలో ఎన్ని శృంగార కార్య కలాపాలు, కామకేళి వినోదాలు జరిపినా) చివరికి ఆమె విధవరాలైన తర్వాత ఆమెను ఏకాంతంగా తన ఓడపై కలుసుకోవడం. వృద్ధాప్యంలో వారి ఆయాస ప్రేమ, ప్రయాసంతో కూడిన శృంగారం. ఎంతో ధనం సంపాదించి, ఓడల యజమాని అయిన Florentina Ariza తన ఓడ పైన దొరికిన ఈ అపురూపమైన ఏకాంతాన్ని తన ప్రియ సఖి, ఆరాధ్య దైవంతో గడపాలని కోరుకుంటాడు. కానీ ఓడ ఏ రేవు లోకి వెళ్ళినా కలరా మహమ్మారి కారణంగా లోపలికి అనుమతివ్వరు. ఈ సందర్భంగా ఓడ సరంగు వచ్చి Florentina Ariza ను ఎంత కాలం ఈ తిప్పలు మనం ఎక్కడా లంగరు వేయలేక ఉన్నాము అంటే “Forever” అంటాడు Florentina Ariza. అర్పించుకునే ప్రేమ, కోరుకునే ప్రేమ, కామం, మొహం వంటి వివిధ ప్రేమ పార్శ్యాలను Marquez మాత్రమే ఆవిష్కరించగలేరేమో అనిపిస్తుంది.
Chronicle of a Death Foretold, “ముందే గ్రంథస్థం చేయబడిన ఒక మృతి”లో తమ చెల్లెలును చెరచి నందుకుగాను ఆమె సోదరులు Pablo మరియు Pedro, Santiago Nasar ను హత్య చేస్తారు. తమ తొలి రాత్రి Vicario భర్త Roman తన భార్య కన్య కాదని కనుగొంటాడు. ఆమెను చెరిచింది, ఆమె కన్యత్వాన్ని హరించింది Nasar అనే ఊహతో అతనిని హత్యచేయడానికి సోదరులు యిద్దరూ పూనుకుంటారు. ఈ సంఘటనలు జరిగిన 26 సంవత్సరాల తర్వాత అప్పటి హత్యను చూచిన, విన్న, తెలుసుకున్న పలువురి ద్వారా Marquez ఈ కథను చేరవేస్తారు. Nasar కుటుంబీకులు, బంధువులు, నగర ప్రముఖులు, అందరూ ఈ హత్య గురించి మాట్లాడుకుంటారు. కానీ ఎవ్వరూ దీనిని ఆపాలని ప్రయత్నించరు. ఒక సాధారణ మృతికి, గ్రీకు ట్రాజెడీ స్థాయిని Marquez ఈ నవలలో ఆపాదించగలిగారు.
Marquez నవలల ద్వారా నేను తెలుసుకున్నది: వాస్తవమే కఠోరమైనది. “Truth is stranger than fiction” అని Shakespeare చెప్పిన విషయం Marquez నవలల ద్వారా నాకు అవగతమయ్యింది. కంటికి కనపడని, ఈ వాస్తవాన్ని, వాస్తవికతలోని వితర్కాన్ని (illogicality) Marquez చిత్రీకరించే విధానం అద్భుతంగా అనిపిస్తుంది. మనం సర్వసాధారణం అనుకునే ఎన్నో విషయాలు, Marquez నవలల్లో సరిక్రొత్త రూపం దాల్చినట్లు వేరే వాస్తవికత (అధివాస్తవికత – Surreal) లోనుంచి ఊడిపడినట్లు అనిపిస్తుంది. Living to tell the Tale లో Marquez తన స్వీయ చరిత్రను రాసుకున్నారు. Aracataca అనే కుగ్రామము నుంచి మొదలైన ఆయన ప్రస్థానం, అయన చనిపోయినపుడు‘ The Most Famous Columbian’ అని ఆయనను ఆ దేశ ప్రధాని కీర్తించడంవరకు సాగింది.
Marquez జీవితాన్ని విమర్శించలేదు. ఆయన నవలలు, వాటిలోని పాత్రలు Latin అమెరికా జీవితానికి ప్రతీకలు. జీవితం ఎలాంటిదైనా దానిని ఆస్వాదించడానికీ అయన కధలలోని పాత్రలు కట్టుబడి ఉంటాయి. The Scandal of the Century” అనే గ్రంథంలో Marquez జర్నలిస్ట్‌గా ఉన్నప్పుడు రాసిన వివిధ వార్తా విశేషాలు, క థలు లాంటివి పొందుపరచబడ్డాయి. యిందులో కూడా వాస్తవం ఎంత భయానకమైనదో ఆయన మనకు తెలియజేస్తారు.
(“Maria of my heart, Only 12 hours to save him, Sleeping beauty on the aeroplane”)
Marquez రాసిన చిన్నకథ ‘ Maria of my Heart’ లో వాస్తవం మనిషిని ఎంతగా వెక్కిరిస్తుందో, కొన్ని సందర్భాల్లో నిజం కూడా దాని విలువ ఎలా కోల్పోతుందో మనం తెలుసుకోవచ్చు. సిటి బస్సు కోసం ఎదురు చూస్తూ ఉంటుంది Maria. బస్సు రాక పోగా భారీ వర్షం మొదలవుతుంది. ఈ పరిస్థితుల్లో కనపడిన మొదటి బస్సును ఆపి, lift అడుగుతుంది. డ్రైవర్ యధాలాపంగా ఒప్పుకుంటాడు. ఆ బస్సులో ఉన్నది Hospital for Mental Diseases కు తరలించబడుతున్న Patients బృందం. బస్సులో వాతావరణం అనుమానంగా ఉన్నా Maria ఎదురు చూస్తూ కూర్చుంటుంది. Driver నేరుగా బస్సును హాస్పిటల్లోకి తరలిస్తాడు. అక్కడ ఉన్నవారూ ఆమెను కూడా Patient గా భావించి దుస్తులు మార్చడానికి ప్రయత్నిస్తారు. తను Patient కాదని తిరగబడి, Phone కోసం అడుగుతున్న మరియా స్వభావం, నడత అందరూ depressed, anxious, psychological disease ద్వారా affected patient లాంటిదే అని భావించి ఆమెను కట్టడి చేస్తారు. ఆమె ఎంత నివేదించినా వారు ఆమెను విడిచి పెట్టరు. చివరికి ఆమె భర్తను కనుగొని, ఆమెను చూడనిస్తారు. ఆమె స్థితి బాగా లేదని ఎప్పుడూ Phone కోసం అడుగుతుందని ఆమెకు treatment అవసరమని చెబుతారు. ఆయన నమ్ముతాడు. చివరకి Maria కూడా నమ్మి ఆ hospital లోనే ఉండిపోతుంది. నిజం, వాస్తవం మరుగున పడితే, ఆ స్థితి ఎంత భయానకంగా ఉంటుందో? వాస్తవం అన్నది మనం నమ్మేదా లేక మన చుట్టూ ఉన్నవారు నమ్మేదా అనేది ఈ కథ అర్ధవంతంగా తెలియజేస్తుంది. ఈ విధంగా నిజం, వాస్తవం, కల్పన, మధ్య ఊగిసలాట ఎన్ని జీవితాలను శాసిస్తోందో అనిపిస్తుంది. Only 12 hours to save him, Sleeping Beauty on the Aeroplane కధలు Marquez లోని మానవతావాదిని, భావుకుడిని మనకు పరిచయం చేస్తాయి.
కొన్ని పుస్తకాలు మనలను ఆనంద పరుస్తాయి. కొన్ని పుస్తకాలు మనలను ఆలోచింపచేస్తాయి, కొన్నిపుస్తకాలు మన జ్ఞానాన్ని పెంచుతాయి. కొన్ని మన అజ్ఞానాన్ని తొలగిస్తాయి. Marquez పుస్తకాలు నా మనో నేత్రాన్ని తెరిచాయి. ఆయన లోని లాటిన్ అమెరికా దృక్కోణానికి నేను పూర్తిగా కట్టుబడిపోయాను. నాకు తెలిసిన యధోచిత జీవితం కాకుండా ఒక సంభ్రమ, విశేషమైన, అధివాస్తవిక, సమ్మోహన జీవితం ఎలా ఉంటుందో అనుభవించగలిగాను. కొన్ని పుస్తకాలు యిలాంటి అనుభూతిని కలిగిస్తాయి. Karl Marx ‘Dialectial Materalism,’ Edward Said ‘Orientalism,’ Chinua Achebe ‘Things Fall Apart,’ Samuel Beckett ‘Waiting for Godot,’ Jacques Derrida ‘Of Grammatology’ పుస్తకాలు సరిగ్గా నాలో అలాంటి అనుభూతినే కల్గించాయి. నాకు తెలియని విషయమో, జ్ఞానమో, సిద్ధాంతమో నేను మొదటిసారి తెలుసుకోగలుగుతున్నానన్న అనుభూతి.
చరిత్ర గతి మార్చిన గొప్ప తత్వవేత్తల్లో Karl Marx తప్పనిసరిగా మొదటి వరుసలో ఉంటారు. Marx మహాశయుడి సమాధి పైన Epitaph పై యిలా రాసి ఉందని అంటారు:
“The Philosophers have only interpreted the world in various ways; the point however is to change it.”
చరిత్ర గతిని అన్వయించడానికి Marx కనుగొన్న సిద్ధాంతం, Dialectical Materialism మరియు The Theory of Surplus Value. ఆవేశపూరితంగా, సైద్ధాంతికంగా, Communism పట్ల ఎంతగా ఆరాధన పెంచుకున్నా, అందులోని ఆర్థిక మూలాలు, ఆర్ధిక శాస్త్ర విశ్లేషణను అర్ధం చేసుకున్నప్పుడు, Marx సమాజాన్ని, అందులోని ఆర్ధిక సంబంధాలను, అసమానతలను ఎంత ప్రభావవంతంగా పరిశీలించారో అర్ధమవుతుంది.
Karl Marx, Engels ప్రతిపాదించిన ఈ Theory of Surplus Value చరిత్ర గతిని మార్చి సమాజ పునర్నిర్మాణ పనికి నాంది పలికింది. ముడిపదార్ధం నుంచి తయారు చేయబడే ఏ వస్తువుకైనా విలువ తెచ్చేది కళాకారుడు, శ్రామికుడు, లేదా పనివాడు. ఈ సిద్ధాంతం ద్వారా Karl Marx, పెట్టుబడిదారులు, పెత్తందార్లు, (Capitalists) దగ్గిర సంపద ఎలా పోగుపడుతున్నదో సరళంగా విశదీకరించగలిగాడు. అలాగే Feudalism నుంచి గ్రామీణ నాగరికతకు, అక్కడ నుంచి పారిశ్రామిక విధానానికి, అందులోని శ్రామిక దోపిడీ, ఈ పారిశ్రామిక సమాజంలో bourgeoisie and proletariat అనే వర్గాల ఏర్పాటు, పారిశ్రామిక విప్లవం అనంతరం వచ్చే శ్రామిక విప్లవం అనే చారిత్రక, సంఘర్షణా పూరిత పరిస్థితులను ఆయన వివరించారు. The Proletariat Revolution తర్వాత ఏర్పడే సమాజంలో అసమతుల్యతలను హేతుబద్ధీకరిస్తూ అందరి అవసరాల కోసం, రాజ్యం ఒక ప్రత్యేక వ్యవస్థను తీసుకు వస్తుందని ఆయన ప్రతిపాదించారు. అదే కమ్యూనిజం.
శ్రామిక వర్గాల ద్వారా స్థాపించబడే ఈ శ్రామికరాజ్యం అందరి అవసరాలను గమనించుతూ సంపదను హేతుబద్దీకరించినపుడు, రాజ్యం అవసరం ముసిగిపోతుందని Marx భావించాడు. అప్పుడు జరిగే పరిణామాన్ని ”Withering away of the State” అని ఆయన అన్నారు. రాజ్యం యొక్క అవసరం తీరిపోయిన తర్వాత, ప్రజలు మేధోవంతులు, జ్ఞానులు కాగలరని అంచనా. రాజ్యం అదృశ్యం అయ్యే పరిణామాన్ని Karl Marx సిద్ధాంతం ప్రతిపాదించిన దానికి భిన్నంగా, సామ్యవాద రాజ్యాలలో రాజ్యాలు మరింత బలీయమై Marx సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పరిణమించాయి. అయితే Marx సిద్ధాంతాలలోని అపరిపక్వత కన్నా రాజ్యాధినేతలు, రాజ్యపాలకుల కాంక్ష, అధికార దాహం, పదవీ వ్యామోహం, నియంతృత్వాన్ని ఆయన ఊహించలేకపోయారు. ఏది ఏమైనా Karl Marx ప్రతిపాదించిన ఈ సిద్ధాంతాలు సమకాలీన సమాజ స్థితి గతులను అన్వయించడానికి, విమర్శించడానికి అత్యంత బలీయమైన ఆయుధాలైనాయి.
సాహిత్య విమర్శలో, విశ్లేషణలో Marx ప్రతిపాదించిన సామ్యవాద సిద్ధాంతాల ప్రభావం వేగవంతంగా, పరిశీలనాత్మకంగా పరిణమించింది. రష్యా సినిమా డైరెక్టర్లు Eisenstein, Pudovkin లు తీసిన
Que viva México, October, Battleship Potemkin, Mother లాంటి సినిమాలలో సామ్యవాద ధోరణి బలంగా అగుపిస్తుంది. కధావస్తువు ఎంపిక ద్వారా సామాన్యులకు సంబంధించిన ఇతివృత్తాలు, Bourgeois వ్యవస్థలో పతనమైన విలువలు, పాలకుల కాఠిన్యాన్ని అద్భుతంగా చిత్రీకరించడం జరిగినది.
Art for Art’s sake అని కాకుండా Art for Ideology, Art for Society అన్న Leon Trotsky వాక్యాలను ఈ చలన చిత్రాలు యధార్థపరిచాయి. సమాజంలో ఏదైతే వాస్తవం, యదార్ధం అని భావించి అంగీకరిస్తున్నామో అది దాని స్వాభావికమైన లక్షణం కాదు అని Marx ప్రవచిస్తాడు. ఎవరైతే “Means of Production” ఉత్పత్తి విధానాలను, ఉత్పత్తి కేంద్రాలను నియంత్రిస్తారో, వారు ఏదో విధంగా సమాజంలోని భావజాలాన్ని, perceived or accepted reality, మనం అసంకల్పితంగా అంగీకరిస్తున్న వాస్తవాన్ని (view of reality) ని నియంత్రిస్తారని Marx ప్రతిపాదిస్తారు. దీనిని విరివిగా Terry Eagleton లాంటి సిద్ధాంత విమర్శకులు సాహిత్యానికి అన్వయించారు.
The concept of Base and Super Structure
నా జీవితం యింతే – యిది నా ఖర్మ, యిది నా అదృష్టానికి లభించిన అవకాశం, అందల మెక్కాలని భావించకూడదు –లాంటి భావాలు మనకి తెలియకనే మనం అనుభవిస్తున్న దాస్యానికి, బానిసత్వానికి సంకేతాలని Marx Super Structure Theory తెలియజేస్తుంది. దోపిడీ చేయబడుతున్న శ్రామిక వర్గాలను తిరుగుబాటు చేయకుండా, బూర్జువా రాజ్యంలో సంతృప్తి పడుతూ లేదా సమాధాన పడుతూ నడుచుకునే విధంగా చేసే ఈ Super Structureను అందంగా అల్లిన సాలెగూడు లేదా కలగా Marx విశదీకరిస్తాడు.
చలామణిలో ఉన్న సాహిత్యం ఎక్కువగా అధికారంలో ఉన్న, సంపదను, ఉత్పత్తి వ్యవస్థను నియంత్రిస్తున్న రాజ్యం, దాని ప్రతినిధుల చేతిలో ఉంటున్నదని మార్క్సిస్టు విమర్శకుల ప్రతిపాదన. Karl Marx ప్రతిపాదించిన సర్వ మానవ సమానత్వం, శ్రమైక జీవన సౌందర్యం యూరోపియన్ సాహిత్యంలో ముఖ్యంగా రష్యన్ నవలలో అత్యున్నతంగా ప్రతిబింబించాయి. నోబెల్ సాహిత్య బహుమతి గ్రహీత Mikhail Sholokhov నవల “And Quiet Flows the Don,” Chinghiz Aitmatov రచన “జమీల్యా” Alexei Tolstoy రచన “అయిలిత” మనకు సామాన్య ప్రజల జీవితాన్నీ, వారి యొక్క ధైర్యాన్ని, సంఘర్షణను పరిచయం చేస్తాయి. సామ్యవాద దృక్పధాన్ని నేరుగా నవలలోకి చొప్పిస్తే అది ఒక రాజకీయ ప్రకటన లేదా గ్రంధం అవుతుంది. అంతే తప్ప అది నవల కాలేదు. సామాజిక, సామ్యవాద దృక్పధాలు కధలో బలంగా ఉండాలి. సంఘంలోని భిన్న శక్తుల మధ్య నడిచే సంఘర్షణ ద్వారా రచయిత సమాజ స్థితిగతులపై ఒక తులనాత్మక పరిశీలన చేయవచ్చు. తన కధలోని పాత్రల ద్వారా భావజాలాన్నితెలియజేయవచ్చు. Pearl S. Buck రచించిన “The Good Earth” Maxim Gorky రచించిన “Mother” అలాగే Mikhail Lermontov రచన “A Hero of Our Time” నవలల్లో సమాజంలోని సాధారణ వ్యక్తుల జీవితం, వారి జీవితంలోని ఆటుపోట్లు, సంఘర్షణలను రచయతలు కొంత మేరకు సామ్యవాద దృక్పధంతో చిత్రీకరించడం జరిగింది.
సామ్యవాద దృక్పధం కధా వస్తువు నుంచే ఉద్భవిస్తున్నది. Gorky రచన Motherలో సమాజ హితం కోసం వెళ్ళిన తన కొడుకు కోసం తపిస్తూ, అతని కోసం బలవంతుడైన యజమానిని కూడా ఎదుర్కొనడానికి తెగువ చూపే తల్లిని (A prototype of all mothers) మనం చూడవచ్చు. రష్యన్ నవలల్లో నేను చదివిన మొట్టమొదటి నవల ‘అమ్మ.’ ఈ నవలను నేను తెలుగు అనువాదంలో చదివాను. అలాగే Ivan Turgenev రచన తండ్రులూ – కొడుకులూ కూడా తెలుగు అనువాదంలో చదివాను. రష్యన్ సాహిత్యం నాకు పరిచయమయిన రోజు నుంచి నేను రష్యన్ సాహిత్యాన్ని అభిమానిస్తూనే ఉన్నాను. అందుకే రష్యన్ నవల కోసం ఒక అధ్యాయాన్ని కేటాయించి చెప్పదలచుకున్నాను. పాఠకులను రంజింపచేసి, ఆనందింపజేసేందుకు చేయబడే రచనలు కొన్ని కాగా, నవలాకారుడు తన చుట్టూ ఉన్న సమాజాన్ని గమనించి, సాంఘిక సమస్యల పట్ల స్పందించి రచయితగా తన కర్తవ్య బాధ్యతను నిర్వర్తించడానికి చేసే రచనలు కొన్నిఉంటాయి. తండ్రులు కొడుకులు నవల సనాతన ధర్మం, కట్టుబాట్ల నుంచి బయటపడి విప్లవం, వ్యక్తిత్వ వాదం, శూన్యవాదం వైపు చూస్తున్న 19 వ శతాబ్దపు రష్యన్ యువత గురించి తెలియ చేస్తుంది. ప్రధాన నాయకుడు బజారోవ్ ను ఆధునిక యువతకు, విప్లవ భావాలకు ప్రతినిధిగా రచయిత మలిచాడు.
Walter Allen రచించిన “The English Novel” లో నవలా రచయితలు ఎందుకు రచన చేస్తారో అన్న దానికి కొన్ని ఉదాహరణలు పొందుపరిచారు. సమాజంలో సరైన నడవడిక ప్రోత్సహించడానికి రచనలు చేసినట్లు Richardson, ఆ కాలపు ఆచార వ్యవహారాలను సంస్కరించడానికి Fielding, సామాజిక దురాచారాలను, దుర్మార్గాలను బహిర్గతపర్చడానికి Dickens, పాఠకులకు చక్కని అనుభూతినీ, ఆనందాన్ని కల్గించి ఆదాయార్జన చేయడం ధ్యేయంగా రచనలు చేసినట్లు Trollope తెలియజేసినట్లు వ్రాశారు. ఆదాయం కోసం సమయానికి ఎడిటర్‌కు పంపడం కోసం ఏదో ఒక విధంగా చేసే రచనలు తీసి ప్రక్కనపెడితే, గొప్ప సాహిత్యం కోవలోకి చేర్చబడే నవలలన్నీ రచయిత యొక్క ప్రాపంచిక దృక్పధం (world view) లేదా వ్యక్తిగత విచారణగా మనం భావించాలి. Personal Reflection, వ్యక్తిగత విచారణలో భాగంగా నవలాకారుడు సమాజ వాస్తవికత Social Realityని అర్ధం చేసుకోవడం, అన్వయించుకోవడం, అందులోంచి ప్రేరణ లేదా ఓదార్పు పొందడం జరుగుతూ ఉంటుంది. ఉదా: Dickens ప్రేరణ లండన్ మహా నగరంతో ముడిపడి ఉన్న క్రింది, మధ్య తరగతి ప్రజల జీవితాలు, అనుభవాలుగా మనం గుర్తించవచ్చు. Thomas Hardy ప్రేరణ Wessex తాలూకా (County) లోని సామాన్య ప్రజానీకం, వారి జీవితపు ఆటుపోట్లు, ప్రేమాభిమానాలు మరియు వారితో విధి ఆడే వికృత క్రీడ. Cossacks నవలలో మొట్టమొదటిసారిగా Olenin పాత్ర ద్వారా Tolstoy సమాజంపై విస్తృతంగా సమాలోచనలు చేసాడు. Cossacks లోని పోరాటస్పూర్తి, జీవితాన్ని ధైర్యంగా ఎదుర్కొనే లక్షణం, తనలోని విలాసవంతమైన దృక్పధం, పిరికితనం, విశ్వాస లేమికి పూర్తి భిన్నంగా ఉన్నట్లు గుర్తిస్తాడు.
ఒక విధంగా Olenin, Tolstoy జీవితానికి ప్రతిరూపం. జీవితం అస్తిత్వ ప్రశ్నను, సామాజిక వాస్తవికత (Social reality) గురించి తర్కించుకోవడం రచయిత బాధ్యతగా మనం భావించవచ్చు. ప్రముఖ రచయితలు ఈ అస్తిత్వ ప్రశ్నలు, తాము ప్రతిస్పందించే విషయాలను ప్రపంచానికి, పాఠకులకు తెలియచెప్పేందుకు ఎంచుకునే విషయం, విధానం (content and mode) మనం నవలలో చూడవచ్చు. F. Scott Fitzgerald రచన The Great Gatsbyలో న్యూయార్క్ సమాజంలోని ధనస్వామ్యం, సంపదకు, ధనానికీ, ఉన్నపాటి విలువ ప్రాణానికి లేకపోవడం, పతనమైన సమాజంలో ప్రేమను పొందేందుకు Gatsby చేసే విఫలయత్నం చక్కగా చిత్రీకరించబడినది. ఒక విధంగా ఆనాటి అమెరికన్ సమాజం ఏ దారిలో వెళుతున్నదో, మానవ సంబంధాలను మించి స్థితి, ఆస్తి, ఆర్జన (status) సంబంధాలు ఎలా సమాజగతిని శాసిస్తున్నాయో అన్న విషయం పట్ల Scott Fitzgerald స్పందించాడని మనం చెప్పవచ్చు. అదే కాలంలో Theodre Dreiser రాసిన Sister Carrie రచన Chicago నగరానికి చేరుకున్న ఒక గ్రామీణ అమెరికన్ యువతి జీవిత గమనం, ఆ క్రమంలో ఆమె వ్యక్తిత్వ నిర్మాణం, విలువల పతనం మనకు తెలియజేస్తుంది. గోవూ జింగ్జిన్ నవల The Soul Mountain లో రచయిత Three Gorges Dam వల్ల త్వరలో మాయమవబోతున్న ప్రకృతి సౌందర్యం గురించి చింతిస్తాడు. ఈ నవలలో ఎన్నో రకాల సాహిత్య ప్రయోగాలు; కల, సామాజిక అధ్యయనం, యాత్రా సాహిత్యం, వృక్షాల పై విశ్లేషణ, చరిత్ర ఇంకా ఎన్నో గమనించ వచ్చు.
Content and mode గురించి మాట్లాడుకున్నప్పుడు నవల యొక్క కథా వస్తువు గురించి యింకా సమగ్రంగా మనం చర్చించుకోవాలి. ఒక set of charactersను సృష్టించి వాటి ద్వారా ఆసక్తిగొలిపే కథను పాఠకులను మెప్పించే విధంగా twists and turns in the plot, కథా గమనంలో ఎదురు చూడని మలుపులు లాంటివి popular novelsలో ప్రధాన స్వభావంగా మనం గమనించవచ్చు. ఉదా: ఆంగ్ల రచయతలు Jeffrey Archer, Harold Robbins, Sidney Sheldon, Irving Wallace లాంటి వారి రచనలు. ఈ నవలలలో వ్యక్తిత్వ నిర్మాణం, పరిశీలన కన్నా పాత్రల మధ్య నడిచే స్వాభావిక ఘర్షణ, సంఘర్షణ, జీవితంలోని మలుపులు లాంటివి ప్రముఖంగా ఉపయోగించబడుతాయి. గొప్ప సాహిత్యంలోని ఆనవాళ్ళు; సామాజికదృక్పధం, విశ్లేషణ, రచయిత యొక్క world-view, సైద్ధాంతిక, మానసిక సంఘర్షణ లోపించినా పాఠకులను ఆకట్టుకోవడంలో యివి ఏ మాత్రం తక్కువ కాకపోగా చాలా రెట్లు ఎక్కువనే చెప్పుకోవాలి. ఎక్కువ మంది పాఠకులు కోరుకునేది చదువుకునేందుకు మంచి పుస్తకం. ఈ పుస్తకం కోసం కేటాయించిన సమయం వృధాకాకుండా చదివిన తర్వాత కలిగే ఆనందం, అనుభూతి; నవల ప్రధానంగా వినోదాన్ని పంచే సాధనమని మనకి దీనిని బట్టి తెలుస్తున్నది.
ఉదా: Jeffrey Archer రాసిన నవల Kane and Abel యిద్దరు ప్రముఖ వ్యాపారవేత్తల జీవితాలు ఏ విధంగా పెనవేసుకున్నాయో, ఒకరిపై ఒకరు పైచేయి సాధించడానికి వారు పన్నే ఎత్తులు, పధకాలు, అంతర్జాతీయ వ్యాపార వ్యవహారాలు, బ్యాంకు లావాదేవీలులాంటి రసవత్తరమైన విషయాల మధ్య వేగంగా నడుస్తుంది. విచిత్రమైన విషయం వీరీద్దరూ ఒకే రోజు ప్రపంచానికి రెండు వైపులా జన్మిస్తారు. ఒకరు Boston నగరంలో ఆగర్భ శ్రీమంతుడి పుత్రుడు William Kane మరొకరు తండ్రెవరో తెలియని నిరుపేద Abel Rosnovski Polandలో జన్మిస్తారు. వ్యాపారదక్షతతో Abel కూడా New York నగరంలో ప్రముఖ Hotelకు అధిపతి అవుతాడు. ఈ యిద్దరు శ్రీమంతుల మధ్య నడిచే వ్యాపార యుద్ధం నేపధ్యంలో నవల ఆద్యంతం రసవత్తరంగా సాగుతుంది. చివరికి తను ఆర్ధిక యిబ్బందులలో ఉన్నప్పుడు తనను ఆదుకున్న అజ్ఞాత వ్యక్తి William Kane అని Abel తెలుసుకోవడంతో కథ ముగుస్తుంది. ఆద్యంతం ఆకట్టుకునే యిలాంటి Jefrrey Archer నవలలును పాఠకులు ఆదరించారు. మన దేశంలో అత్యధిక ఆంగ్ల నవలలు అమ్మబడే రచయిత Jeffrey Archer అనడంలో సందేహం లేదు. ఆయన రాసిన యితర నవలలు A Matter of Honour, First Among Equals, The Prodigal Daughter, Honour Among Thieves, Paths of Glory, As the Crow Flies, A Prisoner of Birth, Shall We Tell the President లాంటివి మొదట నుంచీ చివరి దాకా ఆకట్టుకునే విధంగా, మలుపులు, ఊహించని పరిణామాల నేపథ్యంలో చివరి పేజీ వరకు పాఠకులు నిరీక్షించే విధంగా మలచబడ్డాయి.
ఎక్కువ భాగం ప్రచురితమవుతున్న నవలలు ఈ విధంగా పాఠకులను ఆనందపరుస్తూ వారిని ఉద్విగ్నభరితంగా, ఉత్సాహంతో చదివించే విధంగా పోటీపడడాన్ని మనం గమనించవచ్చు. జనరంజకమైన యిటువంటి నవలల లోంచి మంచి సాహిత్యం రాదా అంటే తప్పకుండా వస్తుంది. కేవలం నవలను ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దడమే కాకుండా నవలా వస్తువులో గాఢత, తద్వారా భాషలో గాఢత, ఈ రెండిటి ద్వారా discourse and narrative భావ ప్రకటన మరియు కధా విధానంలో విశిష్టత సాధించగలడం మనం popular novels లో కూడా తరచూ గమనించవచ్చు. ఉదా: Ken Follet రాసిన Pillars of the Earth, World Without End ను చెప్పుకోవచ్చు. Robert. M. Pirsig రచన Zen and the Art of the Motorcycle Maintenance, రచనలు గొప్ప సాహిత్యంగా నిలుస్తూ popular bestsellersగా కూడా నిలదొక్కుకున్నాయి.
Irving Wallace రచన The Almighty నవల ఒక కాలంలో పాఠకులను విశేషంగా ఆకట్టుకున్నది. ఈ నవల రమారమి అదే యితివృత్తంతో హిందీలో New Delhi Times అని తెలుగులో అంతిమ తీర్పు అని చలన చిత్రంగా మలచబడింది. The Almighty నవలలో కధానాయకుడు నడిపే ఒక ప్రముఖ పత్రికలో ఏ యితర పత్రికలో ప్రచురించబడని వార్తలు(ముఖ్యంగా రాజకీయ హత్యలు లాంటివి)ముందుగా ప్రచురించబడి సంచలనానికి దారి తీస్తాయి. ఆ కారణం చేత ఈ పత్రికకు విశేషమైన పాఠక ఆదరణ లభిస్తుంది. కానీ ఈ వార్తలు యధాలాపంగా జరుగుతున్నవి కావని, పత్రికలో సంచలనాలు ప్రచురించడానికి ఒక వ్యక్తి పథకం ప్రకారం చేయిస్తున్నభయంకర కుట్ర అనీ యితరుల జీవితాలను శాసించగలిగే స్థాయికి చేరిన అతనే The Almighty లేదా భగవంతుడు అని మనకు తెలుస్తుంది. ఆధునిక రాజకీయ పోకడలు, సామాజిక పరిస్థితులను అనుసరించి నవల యిలాంటి సరి కొత్త పంధాలలో పయనించడం కూడా జరుగుతున్నది. సమాజంలో పెరుగుతున్న సాంకేతికత, సంక్లిష్టమవుతున్న ఆర్ధిక, సామాజిక బంధాలు, పెచ్చుమీరుతున్న నేర ప్రవృత్తి ఆధారంగా యిటీవల చాలా నవలలు వ్రాయబడుతున్నాయి. Harold Robbins, Joan Collins లాంటి రచయితలు Hollywood చిత్ర పరిశ్రమలోని చీకటి విషయాల గురించి చాలా రచనలు చేశారు. Harold Robbins రచన The Lonely Lady విజయవంతమయిన చలన చిత్రంగా కూడా మలచబడినది.
1970-80 దశకాల్లో Popular Novels కోవలో అత్యంత ప్రాచుర్యం, పాఠకుల ఆదరణ పొందిన రచనలు Mario Puzo ద్వారా వెలువరించబడ్డాయి. అమెరికన్ మహా నగరాల్లో వేళ్ళూనుకున్నమాఫియా, చీకటి సామ్రాజ్యాలు, వాటి కట్టుబాట్లు, నియమాలు, Code of Honour మాఫియా కుటుంబాల మధ్య యుద్దాలు, నేర ప్రవృతి, వ్యవస్థల విధ్వంసం లేదా అసహాయత యితివృత్తాలుగా ఆయన రాసిన The Godfather, The Sicilian, Omerta లాంటి రచనలు ప్రపంచ వ్యాప్తంగా ఒక క్రొత్త ఒరవడికి నాంది పలికాయి.
అత్యంత ప్రజాదరణ పొందిన ఈ నవలలు Hollywood చలన చిత్రాలుగా మలచబడి Marlon Brando, Al Pacinoలకు అఖండ కీర్తిని తెచ్చిపెట్టాయి. ఇప్పటికీ Popular సినిమాల కోవలో అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రంగా Frances Ford Coppola తీసిన ఈ చిత్రం మొదటి స్థానం నిలబెట్టుకోవడం గమనార్హం. నవలకు సరి క్రొత్త సంస్కృతిని, దృక్పధాన్ని పాఠకులు కోరుకునే thrill and excitementని The Godfather నవల ద్వారా Mario Puzo తీసుకురాగలిగాడు. తదనంతరం ఈ నవల /సినిమా ప్రభావంతో ఎన్నో సినిమాలు యిలాంటి యితివృత్తంతో భారతీయ భాషల్లోవెలువడ్డాయి. ఉదా: Satya, Company, నాయకుడు, Sarkar వగైరా- ప్రజలు నిర్మించుకున్న వ్యవస్థలు నిస్సహాయమయినపుడు లేదా అవినీతిమయమయ్యి ప్రజలకు తోడ్పాటు అందించలేనప్పుడు, యితర వ్యవస్థలు లేదా సమాంతర శక్తులు, కేంద్రాల వైపు న్యాయం కోసం చూడడం జరుగుతుంది. అలాంటి సామాజిక పరిస్థితులలోంచి నాయకులు, లేదా Godfathers పుడతారు. Don Corleone పాత్ర ద్వారా Mario Puzo పాఠకులకు చీకటి సామ్రాజ్యపు మాఫియా కార్యకలాపాల గురించి తెలియజెప్పారు. కేవలం ఈ ఒక్క పార్శ్యమే అయితే ఈ పాత్ర అంతగా చొచ్చుకుని పోయి ఉండకపోవచ్చు. కానీ ఈ పాత్రలోని మంచి – చెడుల సమ్మేళనం, మరీ ముఖ్యంగా దీనిని తెరపై Marlon Brando పోషించిన తీరు ప్రేక్షకులపై చెరగని ముద్రవేసింది.
కధా వస్తువు గురించి చర్చించే సమయంలో ఆధునిక నవల ఎలాంటి పోకడలు పోతున్నదో, ఏ దారులు వెతుకుతున్నదో, ఎలాంటి దృక్పధాలను పాఠకులకు అందిస్తున్నదో తెలుసుకోవడం చాలా అవసరం. ఉదా: Joseph Heller రాసిన Catch-22 నవల ప్రపంచ వ్యాప్తంగా చాలా ప్రఖ్యాతి సాధించింది. ఎంతగా అంటే Catch-22 అన్న పదం జీవితంలోని అయోమయానికి, సంక్లిష్టతకు, అస్థిరత్వానికి పర్యాయపదంగా మారిపోయింది. Yossarain అనే సైనికుడు తన విధుల నుంచి తప్పుకునేందుకు చేసే ప్రయత్నంలో భాగంగా, తనకు అనారోగ్యం ప్రకటింపచేసుకోవాలని అనుకుంటాడు. ఈ యుద్ధం నుంచి తప్పుకోవాలంటే తనను తాను మతిభ్రమించినట్లుగా ప్రకటింపచేసుకోవాలి. కానీ వివేకంతో, తెలివిగా తనను తాను పిచ్చివాడిగా ముద్రింప చేసుకోగలగడం పిచ్చివాడి పని కాదు కాబట్టి అతనికి పిచ్చిలేదు. యిలాంటి సందర్భాన్నే Catch- 22గా రచయిత అభివర్ణించారు. యుద్ధం పైన వ్యంగ్య బాణం, రచయిత స్వీయ అనుభవాల నుంచి యుద్ధం యొక్క అమానుషత్వాన్ని పాఠకులకు వినూత్న పంధాలో ఈ నవల తెలియజేసింది.
Vladamir Nabokov రచన Lolita కధా వస్తువు ఎంత విభిన్నమైనదంటే ఈ పుస్తకం చాలా సంవత్సరాలు నిషేధింపబడడానికి కారణమయ్యింది. మధ్యవయస్కుడైన ఒక వ్యక్తి, కౌమారం లోంచి యవ్వనంలోకి అడుగుపెడుతున్న ఒక అమ్మాయి పట్ల పెంచుకునే ప్రేమ, ఆకర్షణ, అనురాగం, తన కూతురు పట్ల లైంగిక ఆకర్షణతో ఆమెతో ప్రేమకలాపం సాగించే ఒక Stepfather Humbert Humbert కధ యిది. ఈ యితివృతం ఎంతటి దుమారాన్ని రేపిందంటే ఈ నవలను నిషేధించడం జరిగింది. తన పెంపుడు కూతురు Dolores Haze కు సాహిత్య అభిరుచి కల్గిన తండ్రి పెట్టుకున్న పేరే Lolita.
కథా వస్తువుకు అపరిమిత స్వేచ్ఛ లభించడం నవలాకారుడికి ఉన్న ముఖ్యమైన సౌలభ్యం. కానీ ఏదో ఒకటి రాసేసి దానిని నవలగా చలామణీ చేయలేము. పాఠకులు నవల నుంచి కోరుకునేది కథ. ఆ కథను రచయిత పాఠకులకు నేరుగా చెప్పవచ్చు లేదా తనదైన శైలిలో విభిన్నంగా, కళాత్మకంగా, వ్యంగ్యంగా చెప్పవచ్చు. వ్యాసం, పురాణం, నాటకం కన్నా నవలకు కధే ఆధారం. Foucault’s Pendulum లాంటి రచనలో కధే లేకపోవడం, కథా వస్తువుగా భావించినా, The Black Book లాంటి నవలలో కథ వ్రాయడం అనే క్రియపై భావాత్మక, వేదాంత విశ్లేషణ చేసినా, చివరికి అదే ఆ నవలల కథావస్తువు కాబట్టి నవల యొక్క ఆత్మ దాని కథలోనే ఉన్నదని భావించవలసివస్తోంది.
నా స్కూలు రోజుల్లో నేను ఎక్కువగా యిష్టపడిన రచయిత Alexandre Dumas. The Three Musketeers, The Count of Monte Cristo, The Man in the Iron Mask లాంటి నవలలు ఎవ్వరినైనా యిట్టే ఆకట్టుకోగలవు. ముఖ్యంగా చిన్నతనంలో సాహసక్రీడలు, సస్పెన్స్ అంటే ఎవరు యిష్టపడకుండా ఉండగలరు? Dumas నవలల్లో వీటి పాలు ఎక్కువ. చిత్ర విచిత్రమయిన మలుపులతో, ధైర్య సాహసాలు సమృద్ధిగా ఉన్ననాయకులతో, కుట్రలు, కుతంత్రాలలో ఆరితేరిన ప్రతినాయకులతో చారిత్రక ఘట్టాలు, సంఘటనల నేపథ్యంలో ఆయన చేసిన రచనలు ఏ తరం వారినైనా ఊర్రూతలూగించగలవు. The Three Musketeers లోని D’Artagnan పాత్ర గాని, Count of Monte Cristo లోని Edmond Dantès పాత్ర గాని, Dumas నవలా చాతుర్యానికి నిదర్శనాలు. మగవారిని తన వగలాటపు ఉచ్చులో, శలభాల్లాగా మాడ్చివేసే Lady Milady, అధికార దాహంతో అనుక్షణం మహారాణిని నిందింపచేయడానికి ప్రయత్నించే Cardinal Richelieu లాంటి పాత్రలతో The Three Musketeers ఒక మహాద్భుతమైన నవలగా భాసిల్లుతోంది. నవలకు నామధేయం అందించిన Three Musketeers Athos, Porthos, Aramis ల స్నేహం, వారి మమకారం అన్నిటికీ మించి వారి మధ్య పెనవేసుకున్నబంధం
“All for One One for All”ఈ నవలను పాఠకులకు దగ్గిర చేస్తూ ఎంతో ఖ్యాతిని సంపాదించి౦ది.
Dumas రచన The Count of Monte Cristo గురించి యిది వరకే ప్రస్తావించడం జరిగినది. నవలకు కావలసిన action sequences, సందర్భం సృష్టించడం, పాత్రల మధ్య సంభాషణ చురుకుగా సాగేటట్లు చూడడం లాంటి ప్రక్రియలు Dumas మరియు Dickens రచనలలో ఎక్కువ పరిణతి సాధించాయని చెప్పవచ్చు. తర్వాత పేజీలో ఏం జరగబోతున్నదో అని పాఠకులలో ఉత్సాహాన్ని, ఉత్సుకతను పెంచడంలో ఈ రచయితలు అఖండ విజయాన్నిసాధించగలిగారు. Nicholas Nickleby, David Copperfield, Great Expectations, Little Dorrit, Bleak House రచనల్లో Dickens అద్వితీయ కల్పనా చాతుర్యం మనకు సాక్షాత్కరిస్తుంది. ఆయన నిశిత పరిశీలనా దృష్టి, సమాజాన్ని ఆకళింపు చేసుకొన్న తీరు, ఈ నవలల నిండుగా వ్యాపించిన పాత్రల ద్వారా మనకు గోచరిస్తుంది. Peggotty, Bumble, Pumblechook, Uriah Heep, Murdstone, Havisham, Micawber, Fagin, Gradgrind, Pip, Joe లాంటి పాత్రలు సమాజంలో నిత్యం మనకు తారసపడేవే. ఈ సామాన్య పాత్రలలోని వైచిత్రిని, వైవిధ్యాన్ని నవలా వస్తువుగా మలచడమే Dickens గొప్పదనానికి నిదర్శనం. బహుశా 19వ శతాబ్దంలో నవలకు అత్యధిక ప్రాచుర్యం కల్గడానికి Dickens రచనలే ప్రధానమైన కారణం కావచ్చు. Dickens కంటే ముందు యిలాంటి రచనా శైలితో అఖండ విజయాన్నిసాధించిన మరొక రచయిత Jane Austen.
Dickens రచనల్లోని ప్రత్యేకత ఆయన తన పాత్రలను తీర్చిదిద్దే విధానం. నవలలో పాత్రకు ఎంత తక్కువ నిడివి ఉన్నా, ఆ కొద్దిపాటి సమయంలోనే ఒక చిత్రకారుడు తన కుంచెతో ఖాళీ కాన్వాస్ పైన రంగులద్దినట్లుగా Dickens తన పాత్రలకు జీవం పోయగలరు. తన పాత్రల పేర్లు కూడా Dickens తరచూ వారి స్వభావానికి అతికే విధంగా యివ్వడం జరిగేది. ఉదా: Uriah Heep, Fagin అనే పేర్లలోనే వారి దుర్మార్గానికీ, కఠినత్వానికీ కొన్నిసూచనలు మనం చూడవచ్చు. Micawber బహు సంతానంతో తరచూ అప్పులతో బాధపడుతూ ఒక Pauper లాగా ఉండడం కూడా మనం గమనించవచ్చు. నిజ జీవితంలో ఈ పాత్ర Dickens తండ్రికి దగ్గిరగా ఉండవచ్చని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. అలాగే Hard times నవలలో Gradgrind పాత్ర ఎప్పుడూ క్రమశిక్షణ, విధేయతను కోరుకుంటూ ఉంటుంది. కమ్మరి పని చేసే Joe కు Gadget ను గుర్తుకు తెచ్చే విధంగా Joe Gargery అని పిలవడం లాంటివి.
యివి కాక Dumas స్థాయిలోనే Dickens యొక్క ఊహా శక్తి, కల్పనా చాతుర్యం ఆయన నవలలకు ఒక సార్వజనీనత, విశ్వజనీనత ఆపాదించిపెడుతున్నాయి. Dickens రచన Oliver Twistలో ప్రభుత్వ వసతి గృహాల్లో, అనాధ పిల్లలు పడే బాధలను వర్ణిస్తారు. ఆనాటి సమాజంలోని అసాంఘిక, అమానవీయ పరిస్థితులను విమర్శించడానికి ఆయన సంకోచించలేదు. Dickens నవలల్లోని సంఘటనల ఆధారంగా బ్రిటీష్ ప్రభుత్వం పలు సంస్కరణలు చేపట్టడం జరిగింది. ఫ్రెంచి విప్లవం నేపథ్యంలో రెండు నగరాల మధ్య (లండన్ మరియు పారిస్) మధ్య జరిగే సంఘటనల ఆధారంగా Dickens రాసిన A Tale of Two Cities పాఠకులను అబ్బురపరుస్తుంది. ఆ కాలంలోనే ద్విపాత్రాభినయం, (మనిషిని పోలిన మనుషుల మధ్య నడిచే కథ)ఆధారంగా ఈ నవల రూపొందించబడినది. యిలాంటి మనిషిని పోలిన మనుషులు తర్వాతి కాలంలో Mark Twain ద్వారా The Prince and the Pauper మరియు Anthony Hope ద్వారా The Prisoner of Zenda లో కూడా పరిచయం చేయబడ్డారు. పాత్రల ప్రాధాన్యతను విశ్లేషించడానికి ప్రఖ్యాత నవలాకారుడు E. M. Forster Flat and Round Characters అని ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. దీని ప్రకారం పాత్రలలోని లోతు, మానసిక, సైద్దాంతిక విశ్లేషణ ద్వారా పాత్రకు చేకూరే సంపూర్ణత, నవలలో వాటి ఔచిత్యం ఆధారంగా పూర్తి స్థాయిలో తీర్చిదిద్దబడిన పాత్రలు లేక కేవలం సందర్బోచితంగా ప్రవేశపెట్టి ముగించే పాత్రలుగా వర్గీకరించారు. Charles Dickens నవలల లోని పాత్రల విశ్లేషణకు ఈ సిద్ధాంతం బాగా ఉపయోగపడుతుంది. అసలు నవల పాత్రల గురించి కాక మరింకెవరి గురించి ఉంటుంది? Count of Monte Cristo నవలలో Father Faria పాత్రను మర్చిపోగలమా? Edmond Dantes మనసులోని సందేహాన్ని, సందిగ్ధతను పటాపంచలు చేసి అతనెందుకు Château d’Ifలో బంధించబడాల్సి వచ్చిందో అనే రహస్యాన్నితెలియచేస్తాడు Father Faria. Dantes కు సంపద, అత్యంత విలువైన విజ్ఞానం, జీవిత రహస్యాలను బోధిస్తాడు. బలమైన కథ, అదే స్థాయిలో నిలవగలిగే పాత్రలను సృజించడంలో R. L. Stevenson రచనా కౌశల్యం మనం చూడవచ్చు. రెండు ప్రపంచాల మధ్య ఊగిసలాడే Dr. Jekyll and Mr. Hyde పాత్ర కానీ, (రెండూ ఒకరే – విభిన్నపార్శ్యాలు) కపటానికి, మోసానికి ప్రతీకగా నిలిచే పాత్రలో The Master of Ballantrae (యిదొక అద్భుతమైన నవల)కానీ, సముద్రపు దొంగల ప్రతినిధిగా ఉంటూ, తనకూ ఒక హృదయం ఉన్నదని నిరూపించుకునే పాత్రలో Treasure Island నవలలో Long John Silver కానీ, రచయితల ఊహా ప్రపంచంలోనుంచి, వారి కలం నుంచి జాలు వారి పాఠకులను రంజింపజేసిన యిలాంటి పాత్రలు సాహిత్యంలో కోకొల్లలుగా మనం దర్శించవచ్చు.
సాహిత్యంలో వాస్తవికత, భావుకత అనే రెండు ఆలోచనా విధానాలు పరస్పర విరుద్ధమైన సాహితీ ప్రక్రియలుగా విలసిల్లుతున్నాయి. ఫ్రాన్స్‌లో Balzac యింగ్లాండ్లో George Elliot, అమెరికాలో William Dean Howells ద్వారా ప్రాచుర్యంలోకి వచ్చిన వాస్తవిక వాదం – realism ఈనాటి వరకు ప్రాచుర్యంలోనే ఉన్నది. వాస్తవిక ధోరణిలో రచించబడే నవల భావుకత్వానికి భిన్నంగా ఉన్నట్లుగా మనం భావించవచ్చు. జీవితం ఎలా ఉండాలని కోరుకుంటామో( ఉదా: యింకా అందంగా, యింకా ఆహ్లాదకరంగా, ఎంతో ఉద్వేగభరితంగా, మరింత ఆనందాన్ని చేకూర్చే విధంగా లేదా వీరోచితంగా) దానిని రొమాంటిక్ నవల లక్షణంగా మనం భావించవచ్చు. దీనికి వ్యతిరేకంగా జీవితం ఎలా ఉన్నదో, దానిని అలాగే చిత్రీకరించేదే వాస్తవికత. ఈ వివరణ కొంతవరకు నిజమైనా, కొన్ని జీవితాలకు ఇది సరిపోదు. Don Juan, Casanova, T. E. Lawrence లాంటి వారి జీవితాలు యధార్ధంగా, యధాతధంగా చిత్రీకరించినా, అందులోని ఎన్నో సంఘటనలు, వాస్తవాన్ని తలదన్నే ఊహా చిత్రాలను మరపిస్తాయి. యింతకు ముందు అనుకున్నట్లు, Alexandre Dumas రచనలు ఈ కోవలోకే వస్తాయి. తన రచనలు వాస్తవికతకు దగ్గిరగా ఉండాలని నవలాకారుడు సాధారణ జీవితాల నుంచి, అందులోని సంఘటనల ఆధారంగా సృజించవచ్చు. నవలకు ఈ విధమైన వాతావరణ౦ కల్గడానికి రచయిత తన యితివృత్తాన్ని, సాధారణ మధ్య తరగతికి చెందిన వ్యక్తుల గురించో లేదా అబ్బురపరిచే అనుభవాలు లేని వ్యక్తుల జీవితాల నుంచో ఎంపిక చేసుకోవచ్చు. ఈ పాత్రలు సర్వసాధారణమైన అనుభవాలు, ఆనందం, బాధ, జయం, అపజయం, కోపం, విషాదం మధ్య ఊగిసలాడుతూ సాధారణంగానే జీవిస్తాయి. ఎప్పుడో, ఏదో అరుదైన సందర్భంలో వారి జీవితంలో ఒక వెలుగు వెలుగుతుంది, ఒక చెమక్కు మెరుస్తుంది. అప్పుడు వారు హీరోలు అవగల్గుతారు. యితరత్రా వారంతా సాధారణ మనుషులే. యిలాంటి వాస్తవిక ధోరణిని ప్రతిబింబించే నవలలో కేవలం, నవలా విషయమే కాక, నవలా శైలి కూడా వాస్తవికతకు దగ్గిరగా ఉంటుంది. ఉదా: పాఠకుడు చదువుతున్నదంతా వాస్తవం అని అనిపించగలిగే అనుభూతికోసం, ఒకానొక reporting styleను అనుకరించడం. తన నవల Robinson Crusoe లో Daniel Defoe యిలాంటి శైలినే ఉపయోగించాడు. జరిగింది జరిగినట్లు ఒక క్రమ పద్దతిలో, ఎలాంటి నగిషీలు, ఆడంబరాలు, అభూత కల్పనలు లేక జరిగింది పాఠకులు అనుభవించగలిగేటట్లు ఆయన తన శైలిని తీర్చిదిద్దుకున్నారు. కొన్ని సందర్భాలలో Henry Fielding, Jane Austen లాంటి రచయితలు Realists లేదా వాస్తవిక నవలా రచయితలుగా పిలవబడుతున్నారు. వారి నవలల్లో వారు ఎంచుకున్న పాత్రలు, సాధారణ వ్యక్తులు కావడం, లేదా వారి నవల్లలోని యితివృత్తాలు అత్యంత సాధారణమైన విషయాలు కావడం ఉదా: Benjamin Disraeli ప్రకారం, Jane Austen తన పరిధిని మూడు అంగుళాల ఏనుగు దంతంగా (Three inches of ivory) పరిమితం చేసుకోవడం, అపారమైన వాటి జోలికి పోకపోవడం. కానీ ఈ పరిమితమైన యితివృత్తంలోనే ఆమె విశేష ప్రతిభ కనబరిచారు. నవలా రచనలో వాస్తవికతను మొట్టమొదటగా ప్రతిబింబించిన రచయిత Gustave Flaubert. Madame Bovary నవలలో ఆయన ఈ విధానాన్నిఅనుసరించాడు. వాస్తవాన్ని పాఠకుల అభిరుచి మేరకో లేదా రచయిత కోరిక మేరకో సవరించడం, మార్పుచేయడం Flaubert అభిమతం కాదు. ఆయన దృష్టిలో నవలాకారుడు వాస్తవాన్ని నిష్పక్షపాతమైన దృక్కోణంలో తన పాఠకులకు పరిచయం చేసే వ్యక్తి. తర్వాతి కాలంలో ఈ విధానాన్ని పూర్తిగా అనుసరించిన రచయిత Henry James.
వాస్తవికత నవలాకారుడి కథా వస్తువులోంచి గ్రహించబడుతోంది. వాస్తవికవాదంతో రచించబడిన నవలలను వర్ణించడానికి తరచూ పలికే పదం Shocking. సాధారణ జన స్రవంతి లోంచి కఠినమైనది, వేదన కలిగించేది రచయిత ఎంపిక చేసుకోవడం జరుగుతూ ఉండవచ్చు. యివి కాక రచయిత యొక్క శైలి, తన కథా పాత్రలపట్ల సహానుభూతి, వాటిని మలిచే ధోరణి, వాస్తవికవాదాన్నివిశదీకరించడానికి తోడ్పడతాయి. విమర్శకుడు Raymond Williams తెలియచేసినట్లు మానసిక వాస్తవికత(psychological reality) కు విధేయతను కూడా Realismగా భావించడం జరుగుతున్నది. వాస్తవికతను చేరవేయడానికి, వివిధ రకాలైన కళాత్మక విధానాలను అవలంభించవచ్చు. మానవుని అంతరంగం, వ్యక్తిగత ధర్మం, నైతిక విలువలకన్నా సమాజ ధర్మం, సామాజిక విలువలే మనిషి గతినీ, పురోగతిని శాసిస్తాయి. Hardy రచన Jude the Obsure లో Jude Fawley, Sue Bridehead నమ్మిన విలువలు సమాజం దృష్టిలో హేయమైనవీ, ధర్మ సమ్మతం కానివిగా భావించబడతాయి. Psychological realism లేదా మానసిక వాస్తవికతను రచయిత తరచుగా పాత్రల ఆలోచనా విధానాన్ని, అందులోని ఔన్నత్యాన్ని లేదా మూఢత్వాన్ని విశ్లేషించడానికి ఉపయోగిస్తారు. రచయిత ఒక omniscient outlook తో అన్నీ విషయాలను తెలుసుకోగలిగి ఉండడంతో తన పాత్రల మానసిక సరళిని, ఆలోచనా విధానాన్ని యధావిధిగా చిత్రీకరించగలడు. George Elliot రచన The Mill on the Floss లో Maggie Tulliver పాత్రను రచయిత్రి తీర్చిదిద్దిన విధానంలో మనం ఇది గమనించవచ్చు. సామాజిక వాస్తవికవాదం-Sociological Realism లో రచయిత సమాజంలోని వేదనను, పట్టి పీడిస్తున్న సామాజిక రుగ్మతలను, అసమానతలను బహిర్గతపరచడం జరుగుతుంది. సమాజంలోని అస్తవ్యస్త పరిస్థితులను, అన్యాయం, అక్రమాలను వెలికితీసి సమాజ పోకడలను విశదీకరించడం ద్వారా రచయిత పాఠకులకు తన దృక్పథాన్ని చేరవేస్తాడు. ఈ క్రమంలో రచన ఒక సామాజిక బాధ్యతగా నవలాకారుడు తన చుట్టూ ఉన్న స్థితిగతులను పాఠకులకు తెలియపరచడం కోసం, వాస్తవాన్ని ఒక ఆయుధంగా మలుచుకుంటాడు. సామాజిక బాధ్యతతో చేపట్టిన యిలాంటి నవలలు, నవలకు, రచయితకు ఒక ప్రత్యేకమైన స్థానాన్నిఆపాదిస్తున్నాయి. Harriet Beeches Stowe రాసిన ‘Uncle Tom’s Cabin, Maxim Gorky ‘Mother’ సామాజిక నవల బాధ్యతను యినుమడింపచేసాయి. ఈ రచనల్లోని వాస్తవికత, సామాజిక చిత్రీకరణ, ఆనాటి పాఠకులను కదిలించి స్పందింపజేసింది.
సాహిత్యానికి సామాజిక బాధ్యత ఉన్నది అని భావిస్తే – Not Art for Art’s Sake but Art for Society’s sake-అలాంటి సాహిత్య సృష్టిలో వాస్తవిక నవలాకారుడు ముందు వరుసలో ఉంటాడు. పీడిత, తాడిత, బాధిత, వంచిత, ప్రజల కోసం తన కలాన్నికదిలించే రచయితలు చిరకాలం గుర్తుంటారు. వాస్తవికతకు విరుద్ధమైనదిగా భావుకతను మనం పరిగణించినపుడు అలనాటి 18వ, 19వ శతాబ్దపు ఆంగ్ల Romantic కవులు స్పురణకు వస్తారు. ప్రకృతి ఆరాధన, దైవత్వం, సౌందర్య ఆరాధన, స్వేచ్ఛ, అనుభూతి, ఆనంద శోధన మార్గాన్నిఎంచుకుని Blake, Byron, Shelley, Keats, Coleridge మరియు Wordsworth లాంటి కవులు అపురూపమైన, చిరస్మరణీయమైన రచనలు చేశారు.
“When the stars threw down their spears
And water’d heaven with their tears:
Did he smile his work to see?
Did he who made the Lamb make thee?”
“A slumber did my spirit seal;
I had no human fears:
She seemed a thing that could not feel
The touch of earthly years.
No motion has she now, no force;
She neither hears nor sees;
Rolled round in earth’s diurnal course,
With rocks, and stones, and trees.”
భావుకత ఈ కాలంలో ఆంగ్ల సాహిత్యాన్ని విస్తృతంగా ఆవహించింది. దీని ప్రభావం Alfred Tennyson, Matthew Arnold, HW Longfellow, Dante Gabriel Rossetti, Swinburne కవితల్లో కూడా మనం చూడవచ్చు. నవలల్లో దీని ప్రభావం నేరుగా కాకపోయినా అంతర్లీనంగా మనం చూడవచ్చు. Defoe రచన Robinson Crusoe లో స్వేచ్ఛ, అనుభూతి, ప్రకృతి ఆరాధన, మానవ ప్రయత్నం, శక్తి సామర్ధ్యాల ప్రస్తావన మనం చూడవచ్చు. భావుకత, తన్మయత్వం, ప్రకృతితో మమేకం కావడం లాంటి లక్షణాలు మనం Wuthering Heights, Jane Eyre లాంటి నవలల్లో కూడా చూడవచ్చు.
18వ శతాబ్దపు బ్రిటీష్ నవలాకారుల్లో తన కంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సముపార్జించుకుని, ఈ నాటికి కూడా విశేషంగా పాఠకులను అలరిస్తున్న రచయిత్రి Jane Austen. Pride and Prejudice, Emma, Persuasion, Sense and Sensibility లాంటి ప్రఖ్యాత నవలలను రచించిన Jane Austen తన చుట్టూ ఉన్న సమాజంలోని వ్యక్తులు, ఆనాటి యింగ్లాండులోని సామాజిక ఆచారాలు, దిగువ, ఎగువ మధ్యతరగతి కుటుంబాలలోని ప్రధానమైన సమస్యలు; వివాహం, వివాహ జీవితం, వర్గాల మధ్య సామాజికబంధాలు, అనే అంశాల పైన తన నవలల ద్వారా విస్తృతమైన చర్చ చేశారు.
పాత్రలను రూపకల్పన చేయడంలో Jane Austen అపారమైన ప్రతిభ కనబరిచారనడంలో సందేహం లేదు. నవలా ప్రపంచంలో ఆమె సృష్టించిన పాత్రలు అసంఖ్యాక పాఠకులను ఆకట్టుకున్నాయి/యింకా ఆకట్టుకుంటూనే ఉన్నాయి. సమాజాన్ని నిశితంగా గమనించడం, ఆ సమాజంలోని వ్యక్తుల స్వభావం, వైరుధ్యాలు, విచిత్ర పోకడలను ఆమె తన పాత్రలకు చక్కగా అన్వయింప చేయగలిగారు. The Domestic Scene అనగా సాధారణ జీవితం, ప్రేమ, వివాహం, ఆకర్షణ, విరహం, యువతీ యువకుల జీవితాలలోని యవ్వనపు తరంగాలు, అలాగే వివాహ సంబంధాలు, దాంపత్యంలో ఐశ్వర్యం, సంపద చూపే ప్రభావం, ఉన్నవారు, లేని వారి మధ్య సమాజం చూపే వివక్ష లాంటి వెన్నోఆమె తన నవలలలో సృజించారు.
Jane Austen శైలి ఒక అనిర్వచనీయమైన హాస్య చతురతతో కూడిన శైలి. (Ironical humor). ఆమె రచనల్లో Pride and Prejudice యిప్పటికీ Universal Favourite గా కొనసాగుతుండడానికి కారణం ఆ నవలలోని పాత్రలు, సన్నివేశాల మరియు హాస్య చతురోక్తులతో (witticisms, repartee) కూడిన Jane Austen శైలి. తనకు తెలిసిన ఈ జీవితం(three inches of ivory) పైన పట్టు కోల్పోకుండా సాధన చేసి యిప్పటికీ పాఠకులను అలరించగలుగుతున్నారు Jane Austen.
“She is tolerable, but not handsome enough to tempt me” – Darcy
“My courage always rises at every attempt to intimidate me. ” – Elizabeth Bennett
Had you behaved in a more gentlemanlike manner? ” – Elizabeth Bennett
పైన తెలిపిన సంభాషణలన్నీ Pride and Prejudice నవల లోనివి. రచయిత్రి పాత్రల రూపకల్పన ఎంత ప్రగాఢమైనదంటే, ఈ నవల నిజంగా జరిగిన సంఘటనల సమాహారమా అనిపించకమానదు. నేను మళ్ళీ, మళ్ళీ చదివి, చదివిన ప్రతిసారి ఆనందించిన నవల Pride and Prejudice. ఈ కథని మొదటిగా Jane Austen “First Impressions”అని నామకరణం చేసారని చెబుతారు. తర్వాత దీని పేరును Pride and Prejudiceగా మార్చడం జరిగినది. ఈ నవలలోని Heroine Elizabeth Bennett అజరామరమైన కీర్తిని, ప్రాముఖ్యతను సంపాదించుకున్నది. అందం, అహంకారం, అభిమానం, సౌజన్యం, సమయస్ఫూర్తి, విశ్లేషణాసామర్థ్యం, ఆత్మసౌందర్యం, అభిరుచి, తెలివి అన్నీ కలబోసిన అద్భుత కథానాయిక Miss Elizabeth Bennett. ఈ పాత్రను మించిన కథానాయిక ప్రపంచ సాహిత్యంలో మరింక సృజింపబడలేదని ఖచ్చితంగా చెప్పవచ్చు. Herione కు సమానమైన స్థాయిలో ఆమెకు దీటుగా తీర్చిదిద్దిన పాత్ర Mr William Darcy. వీరిద్దరి మధ్య జరిగే సంఘర్షణ ఏర్పడే విరుద్ధ భావాలు, అనుమానపు తెరలు, అపోహలు తొలగిపోయి ఒకరిపై ఒకరికి ఏర్పడే అనురాగ భావం, ఆరాధన, అడ్డంకులను అధిగమించి పరిపూర్ణమయ్యే వారి ప్రణయం. ఈ నవలలోని ఈ theme రాబోయే కాలాలకు ఒక Classic Romantic Love Storyకి కావలసిన సూచనలు అందచేసింది. యిదే నవలలోని పలు పాత్రలు ఉదా: Mr. Collins, Mr. Wickham, Mrs. Bennet, Lady Catherine De Borough, Charlotte, Georgiana, Miss Bingley, Mr. Bennet, Jane Bennet లాంటి పాత్రలు ఆనాటి సమాజంలోని వ్యక్తులను, సామాజిక ధోరణులను Jane Austen చేసిన నిశిత పరిశీలనగా మనం భావించవచ్చు.
ఆంగ్ల నవలా ప్రపంచంలో Jane Austen, తర్వాత ప్రముఖంగా వినపడే మరొక మహిళా రచయిత George Elliot. George Elliot అసలు పేరు Mary Ann Evans. Mill on the Floss, Silas Mariner, Daniel Deronda, Middle March లాంటి నవలలు George Elliot ప్రతిభా విశేషాలను మనకు తెలియచేస్తున్నాయి. Jane Austenకు భిన్నంగా, వ్యక్తిత్వ అన్వేషణ, అంతర్ముఖమైన శైలి, సమాజ కట్టుబాట్లు, ఛాందస భావాలను ప్రశ్నిస్తూ, ఎదురొడ్డి పోరాడే ఆత్మస్థైర్యం ఉన్నపాత్రలను George Elliot తన నవలల్లో ఎంచుకున్నారు. ఈ విధంగా George Elliot నవల యొక్క పరిధిని విస్తృత పరిచారని చెప్పవచ్చు. సమకాలీన సమస్యలపై సైద్ధాంతిక చర్చ, ముఖ్యంగా మతం, రాజకీయాలు, సామాజిక కట్టుబాట్లపై తిరుగుబాటు ఆమె నవలల్లో గమనించవచ్చు. ఆమె రచనల్లో నేను చదివిన The Mill on the Floss నవలలో, George Elliot, గ్రామీణ యింగ్లాండు జీవితాన్ని, అందులోని బాల్యాన్ని(బాల్యాన్నిఆమె ఈ నవలలో Golden Gates అని పిలుస్తుంది ) బాల్యంలో మనము అనుభవించే స్వేచ్ఛ, ఆత్మానుభూతి, ఆనందాన్ని, ప్రకృతి ఒడిలో గడిపే యవ్వనపు తొలి స్మృతులు ఈ నవలలో మనము Maggie Tulliver పాత్ర ద్వారా దర్శించవచ్చు. ఈ నవలను ఆత్మ కధానువాదంగా మలచాలని రచయిత్రికి లేకపోయినా, Maggie Tulliver మరియు Mary Ann Evansల మధ్య సారూప్యత మనం చూడవచ్చు. ఈ నవలలో Millను మానవునికి తద్వారా లోకానికి సంబంధించినదిగాను, నదిని ప్రకృతికి, అలౌకికమైన దానికి ప్రతీకగాను మనం చూడవచ్చు. ఆనాటి విక్టోరియన్ కాలంలో ప్రజాదరణ పొందిన ప్రముఖ ప్రేమ కథా రచనల వలే కాక, The Mill on the Floss, సమకాలిన శక్తులు, సంక్లిష్టమైన సామాజిక మార్పులు, వ్యక్తి మరియు సమాజం మధ్య జరిగే సంఘర్షణ లాంటి బలమైన కథా వస్తువులతో తీక్షణమైన, వివేకమంతమైన దృక్పథంతో చేసిన నవలగా మనం చూడవచ్చు.
కొన్ని సందర్భాలలో Meredith మినహా అత్యంత ఆలోచనాపరురాలిగా, George Elliotను పేర్కొంటారు. ఆమె రచనల్లో నవల ఆధునికతను సంతరించుకున్నది. ప్రతి అధ్యాయం మరొక దానితో పెనువేసుకుని, అన్నీ ప్రధాన యితివృత్తానికి లోబడి ఉంటాయి. అలాగే కథ మొత్తం కూర్పు Plot తో సమన్వయం చేయబడుతుంది. మతం మరియు నైతికత లాంటి అంశాలపై అపనమ్మకం లేదా(scepticism) ఆ కాలంలోని రచయితలు, మేధావుల్లో నెలకొని ఉండేది. Matthew Arnold పద్యాలవలె సమకాలీన పరిస్థితులపై, ఆలోచన విధానాలపై ఆమె సహేతుక పరిశీలన చేశారు.‘ఆలోచనల నవల’ The Novel of Ideas కు George Elliot ఊపిరులూదారు. ప్రకృతి సహజమైన కరుణ, ప్రేమ, దయ, సౌహార్ధతకు వ్యతిరేకంగా పూర్తిగా మోసపూరిత వ్యక్తిత్వం కాకపోయినా, పరిస్థితులకు లొంగి దిగజారిపోయే పాత్రలను ఆమె నవలల్లో విస్తృతంగా చిత్రీకరించారు.
“We could never have loved the earth so well, if we had had no childhood in it”
“The illusory promises of our childhood”
The Mill on the Floss లో బాల్యం గురించి పలు వర్ణనలు ఉన్నాయి. ఈ నవలలో ప్రతి సన్నివేశం ఆ మనుషుల వ్యక్తిత్వాల నుంచి ఉద్భవించే విధంగా, సన్నివేశం, కథ, కథాగమనం, పాత్రల చిత్రీకరణ అన్నీ సమన్వయముతో, సమ్మిళితమై ఉండే విధంగా రచించబడినది. పరిమితమైన ఒక అంతరంగిక సమూహం యొక్క నైతిక సందిగ్దతను వారిని చుట్టి ఉన్న బాహ్య ప్రపంచంలో వారు నివృత్తి చేసుకునే విధంగా George Elliot ఈ నవల లోని పాత్రలను తీర్చిదిద్దారు.
ఆమె రాసిన మరొక నవల Silas Mariner (The Weaver of Raveloe) తెలుగులో ఈ నవల B. N Reddy గారిచే బంగారు పాపగా తెరకెక్కించబడినది. ఈ నవలలో George Elliot తన సర్వహిత మానవతా వాదాన్ని అద్భుతంగా ప్రకటించారు. సమాజపు అణగారిన, బడుగు వర్గానికి చెందిన నేతగాడు Silas Mariner పై George Elliot తన దయ, వాత్సల్యం, ప్రేమను కనబరిచారు. ప్రతి వ్యక్తి తన నిర్మాణానికి, పురోగతికి తనే బాధ్యుడవుతాడు (Determinism). ఆటంకాలు, అవరోధాలు ఎన్ని ఉన్నా వ్యక్తిగా నా ఎంపిక నా జీవితాన్ని మలుస్తున్నది అన్న సిద్ధాంతం George Elliot నవలలో మనం చూడవచ్చు. అలాగే Henry James మాటల్లో, “George Elliot’s humanity colours all her other gifts.”
Erziehungsroman – ఈ జర్మన్ పదం అర్ధం – విద్యార్థిత్వాన్ని సూచించే నవల. Mill on the Floss ను ఈ కోవ క్రింద మనం వర్గీకరించవచ్చు. Hero లేదా Heroine యొక్క మేధస్సు, వ్యక్తిత్వం, వివిధ అనుభవాల ద్వారా బాల్యం నుంచి పరిణతి చెందడం, అనుకోని అవాంతరాలు, ఆధ్యాత్మిక లేదా మానసిక సంక్షోభం ద్వారా విలువైన జీవిత పాఠాలు నేర్చుకోవడం, పరిణతి, స్థితప్రజ్ఞతతో ఈ సువిశాల ప్రపంచంలో తన విలువను తెలుసుకోవడం లాంటివి. పై నవలలో George Elliot నవలా విధానం, ఈ విధమైన శైలికి దగ్గిరగా ఉందని మనం అనుకోవచ్చు.
విమర్శకుడు E. Albert మాటల్లో, నవలా సాహిత్యంలో George Elliot స్థానం ప్రముఖమైనది. మానవ వ్యక్తిత్వం మరియు సమాజంలోని యితర బలీయమైన శక్తులు మధ్య ఉన్న సంబంధాలు, సంఘర్షణపై ఆమె తీవ్రమైన దృక్కోణంతో పరిశీలించారు. అంతరంగిక ఆలోచన వ్యక్తిత్వ స్పృహపై ఆమె చేసిన సమగ్ర మానసిక, సాంఘిక విశ్లేషణ ఆంగ్ల నవల భావి గమ్యాలకు దారులు వేసింది.
Thomas Hardy:
Charles Dickens తో బాటు అంతర్జాతీయ ఖ్యాతిని సంపాదించుకున్న ఆంగ్ల నవలాకారుల్లో Thomas Hardy ఒకరు. ఆంగ్ల సాహిత్యంలో విక్టోరియన్ యుగంగా పేర్కొనబడే కాలంలో మొదటి అర్ధ భాగాన్నిThomas Hardy ఆధిపత్యం కనబరుస్తారు. పట్టణ మరియు దిగువ మధ్య తరగతి ప్రజల మనోభావాలు మరియు స్పృహపై Dickens తన దృష్టిని ప్రసరిస్తే, గ్రామీణ యింగ్లాండుకు ప్రతిరూపమైన Wessex County లో ప్రజల, నాగరికత, సంస్కృతి, సమాజ నిర్మాణం, సామాజిక బంధాలపై Hardy తన నవలలను కేంద్రీకరించాడు. యిద్దరు నవలాకారులూ ఆంగ్లజాతి (English Race) యొక్క ఆశలు, ఆశయాలు, నిరాశ, నిస్పృహలను వారి రచనల్లో పరిశీలించారు. వారి రచనల యొక్క ప్రతిభ, ఏక సమయంలో, చైతన్యవంతంగానూ, కళాత్మకంగాను ఉన్నది. ఆంగ్ల ప్రజల ఆలోచన, ఉహాశక్తిని Bible మరియు Shakespeare రచనలు ప్రభావశీలం చేసిన విధంగానే వీరిద్దరి రచనలు పాఠకులను ఉత్తేజపరుస్తున్నాయి.
ఈ కారణాల చేత పాఠకుల అభినందనలు Hardyకి దక్కుతున్నాయి. తన స్వానుభవమైన Wessex ప్రాంతంలోని జీవితపు ఒడిదుడుకులు, లయను మనం అనుభవించగల్గడం, ఆంగ్లేయుల అంతర్దృష్టి మరియు ఆధ్యాత్మిక జీవితంలో పాలుపంచుకోవడమే అవుతుంది. అందుచేతనే Raymond Williams Hardyని “He is our flesh and grass” అని అంటాడు.
Hardy నవలలలోని fatalism, బలీయమైన విధి ఎక్కువభాగం Wessex కథలలోంచి, గ్రీకు నాటకాలలోంచి, Bible మరియు Shakespeare కథలలోంచి ప్రేరేపితమయ్యిందని అనుకోవచ్చు.
నా M. A. course లో భాగంగా Jude the Obscure, ఆ తర్వాత ఆసక్తితో Tess of the d’Urbervilles, అలాగే B. A లో Return of the Native, The Mayor of Casterbridge నవలలు చదవడం జరిగినది. ఊహాజనిత Wessex County ఆధారంగా Hardy తన నవలల్లో 18, 19వ శతాబ్దపు గ్రామీణ యింగ్లాండు జీవితాన్ని అద్భుతంగా చిత్రీకరించారు. ఈ సమాజంలో మూఢ నమ్మకం, ఛాందస వాదం, మతానికి ప్రాధాన్యత, వ్యత్యాసం వేళ్ళూనికుని ఉన్నాయి. అలాగే జనిస్తున్న క్రొత్త ఆలోచనలు, సిద్ధాంతాలు, విద్య మరియు ఆధునిక భావాలు, అప్పుడే వాటి ప్రభావం చూపించడం మొదలుపెడుతున్నాయి. Michael Henchard, Sue Bridehead, Tess, Jude Fawley లాంటి వ్యక్తులు ఈ ఆధునిక భావాలతో అణుకువను అధిగమించి ప్రశ్నించే ధోరణితో మనకు ఈ నవలల్లో తారసపడతారు. Hardy నవలలు ఎందుకు విషాదాంతాలుగా మిగిలిపోతాయి? Hardy నవలల లోని (Protagonists) నాయికా నాయకులు ఎందుచేత అసంపూర్ణంగా అపజయంతో వారి యాత్ర ముగిస్తారు? ప్రకృతి లేదా బలీయమైన విధితో పోరాడడానికి మానవుని శక్తి, సామర్థ్యాలు సరిపోవనే అభిప్రాయం కావచ్చు. ఈ విధి లేదా అతీతమైన శక్తి Hardy నవలల్లో ఎప్పుడూ తీక్షణ దృష్టితో పరికిస్తూనే ఉంటుంది. Tess of the d’Urbervilles నవలలో గతంలో తనకు Alecతో ఉన్నటువంటి సంబంధం, ఏ విధంగా అతను తనను మోసంచేసినదీ వంటి వివరాలతో ఒక లేఖ రాసి Reverend Clare కుటుంబానికి నిజాలు తెలియజేయాలనే ఉద్దేశ్యంతో Tess ఆ యింటికి వెళ్ళి తలుపు క్రింది నుంచి ఆ లేఖను తోస్తుంది. Angel Clare మరుసటి దినం Tessతో ప్రేమగా, అనునయంగా మాట్లాడటంతో Angel ఆ లేఖను చదివి తన గతాన్నిఅర్థంచేసుకొని, తనను స్వీకరించాడని భావిస్తుంది. కానీ విచిత్రం గా(విధిక్రీడ) ఆ లేఖ తలుపు క్రింది నుంచి Carpet క్రిందకు వెళ్ళిపోవడంతో ఎవరి కంటా పడలేదని తర్వాత తెలుస్తుంది. తరువాత ఈ లేఖను కనుగొని Tess కాల్చేస్తుంది. వివాహం తరువాత తొలి రేయి, తన సంబంధం గురించి Angel చెప్పడంతో Tess కూడా ధైర్యంగా Alec తో తను ఎదుర్కొన్న అనుభవాన్నితెలియచేస్తుంది. కానీ Angel ఆమెను అర్థంచేసుకోకపోగా తన దృష్టిలో, Tess పైనున్న అభిమానం, ప్రేమ, గౌరవం కొంత తగ్గాయని చెబుతాడు. వారిద్దరూ విడిపోవడమే భావ్యమని, తను చెప్పేదాకా తిరిగి రావద్దని చెప్పిAngel వెళ్ళిపోతాడు. దిక్కులేని Tess తిరిగి మత ప్రబోధకుడిగా మారిన Alec చేతుల్లోకి వెళ్ళిపోతుంది. ఈ నవలకు Hardy యిచ్చిన పూర్తి పేరు. “Tess of the D’Urbervilles: A Pure Woman Faithfully Presented”, Preface లో “Poor wounded name! My bosom as a bed
shall lodge thee”
పూర్తిగా భవిష్యత్తుపై ఆశ కోల్పోయిన Tess తనను తాను బలి తీసుకుంటుంది. Hardy తన నవలను “The President of the Immortals has finally ended his game with Tess”అని ముగిస్తాడు. ప్రకృతి కాంత ముద్దుబిడ్డ Tess కల్మషం, కపటం, కుసంస్కారుల లోకంలో యిమడలేక సెలవు తీసుకుంటుంది. వ్యక్తిలోని కొన్ని వ్యక్తిత్వ దోషాలు, కూడా వారి పతనానికి దారితీస్తాయని Hardy భావిస్తూ ఉండవచ్చు. తన కామోద్రేకానికి Jude బానిస, తన మద్యపానానికి Michael Henchard లోబడతాడు.
Determinism and fatalism అనే ఈ రెండు సిద్ధాంతాల నడుమ Hardy రచనలు, అందులోని పాత్రలు జీవించి, నశించడం మనం చూడవచ్చు. గ్రీకు నాటక కర్తలు, Euripides, Aeschylus, Sophocles లు రచించిన ప్రముఖ విషాదంత నాటకాలైన (Tragedies) Phaedra, Agamemnon, Oedipus Rex, లోలా Hardy రచనల్లోని వ్యక్తులు, బలీయమైన విధి వ్రాతలో కొట్టుమిట్టాడుతున్నారు. భగవంతుడు/ప్రకృతి రాసిన ఈ విషాద కావ్యంలో సృజన, సంతోషం, ఆనంద పారవశ్యం పూర్తిగా అనుభవించలేని వారౌతారు. Tess of the d’Urbervilles నా మీద ప్రగాఢమైన ప్రభావం చూపించింది. ఆడే పాడే Romance, Thriller, Picaresque నవలలు చదువుతూ ఆనందించిన నేను, Hardy విలక్షణమైన, తీక్షణమైన కథలకు, శైలికి ప్రభావితుడినయ్యాను.
రచయిత ఎప్పుడైనా తన అనుభవ సారాన్ని రంగరించి తను చెప్పదలుచుకున్న కథను పాఠకులకు చేరవేయ తలుచుకుంటాడు. నిజానికి రచనా ప్రక్రియ పూర్తిగా భాషతో అనుసంధానమై ఉన్నది. అనుభవాన్ని, పాఠకులలో రసోత్పత్తి భావనలు కలిగించడానికి, రచయిత భాషనే ఆశ్రయిస్తాడు. పలువురు విమర్శకులు తెలియజేసినట్లు Language transforms the experience during the creative process. చివరికి రచన, భాష, శైలి యితర ప్రక్రియల ద్వారా కొన్ని సార్లు రచయిత కూడా ఎదురుచూడని భావ ప్రకటనకు దారి తీయవచ్చు. ఈ భాషా, భావవ్యక్తీకరణ కొన్నిసార్లు రచయిత స్వానుభవాన్నిమార్చవచ్చు, వేరే విధంగా రూపాంతరం చేయవచ్చు, మరింత పరిపుష్టం చేయవచ్చు. రచయిత మూల వస్తువు అనుభవం లేదా ఊహ అయితే(Content) ఆ మూల వస్తువును నవలానుగుణంగా మార్చేది, నవలాకృతినిచ్చేది Technique. Form మరియు Contentను నిర్మాణం మరియు విషయంను సమన్వయపరిచేది Technique. Technique ద్వారా కొన్ని సంధర్బాలలో రచయిత ఎదురుచూడని, అనుకోని భావరసజ్ఞత ఉత్పన్నం కావచ్చు. కధా వస్తువు, పాత్రల చిత్రీకరణ, విశ్లేషణ లాంటి పరిధిని దాటి, ఆధునిక సాహిత్య విమర్శ భాష ద్వారా ఉత్పన్నం అయ్యే సంకేతాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నది.
The Scope and relevance of the linguistic sign.
ఆధునిక భాషా శాస్త్రవేత్త Ferdinand de Saussure తన సిద్ధాంతాన్ని ప్రవచించినప్పటినుంచీ భాషలోని సంకేతాలు, భాషలోని శ్లేష, భాషలోని Supplementarity పై పలువురు పరిశోధనలు చేశారు. భాషకు అర్థం మనం ఎలా ఆపాదిస్తున్నామో తెలుపుతూ Saussure యిలా అంటారు. ఒక పదాన్ని రెండు అంశాల కలయికగా ఆయన ప్రతిపాదించారు, The Signifier and the Signified ఈ రెండు కలిపితే ‘Sign’ అవుతున్నది.
యిక్కడ Signifier శబ్దం అయితే (Phonetic), Signified (Semantic) అర్థం అవుతుంది. శబ్దం మరియు అర్థం కలయికనే సంకేతంగా ఆయన సూచించాడు. శబ్ద ఉచ్చారణలో తేడా ద్వారా(అనగా దానిని Phoneme అంటారు) ఒక సంకేతానికి మరియు యింకో సంకేతానికి మధ్య భేదాన్ని గుర్తించగలుగుతున్నట్లు తెలియజేసాడు.
Leap, peep, beep, seep, weep, keep, deep అనే పదాలు చూస్తే ఒక్క phonetic unit మార్పుతో సంకేతం మారడాన్ని మనం గమనించవచ్చు. అలాగే Signified గా మనం అనుకునేది అపారమైన భాష సంపదలో తనను వేరే వాటి నుంచి భిన్నంగా వర్గీకరించుకుంటుంది. ఉదా – hill/mountain/hillock లాంటి వాటి మధ్య వ్యత్యాసం. అలాగే లిఖిత పదం, the written sign అనేది రెండిటి కలయిక the phoneme – పదానికి శబ్దాత్మను యిచ్చేది the morpheme –పదానికి అర్దాత్మను యిచ్చేది. అలాగే భాషలో Sign కు అర్థం పలు విషయాలపై ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు.
సంస్కృతి –సామాజిక ఒడంబడిక ఉదా: పూలు భారతీయ సమాజంలో ఎక్కువగా శుభానికి సంకేతం అయితే కొన్ని సమాజాలలో పూలను ఎక్కువగా సంస్మరణ, సంతాపం సూచనగా ఉపయోగిస్తారు. యింకొక ఉదాహరణగా మృతి చెందిన వారి భౌతిక కాయంపై గౌరవార్థం ఉంచే పూలను ఎందుకు గుండ్రంగా (Ring like) చేస్తారు. ఎందుకంటే Cultural codeలో ఆ Signకు, అలాంటి పూల ఏర్పాటుకు అలాంటి అర్థం ఉన్నది. జాతీయ గీతం ఆలపించినప్పుడు గుండెలపై చేయి పెట్టి నిలబడడంలాంటివి. జీవితంలో ప్రతి సంకేతం భాషతో నిమిత్తం లేకపోయినా, అర్థం రీత్యా ఎంతో ప్రాధాన్యత కల్గినది. ఈ శాస్త్రాన్నేSemiotics అంటున్నారు. Semiotics శాస్త్రంలోంచే Structuralism, Post-Structuralism, లాంటి సిద్ధాంతాలు ఉద్భవించాయి. Levi Strauss, Roland Barthes, Jacques Lacan, Michel Foucault, Jacques Derrida లాంటి సిద్ధాంతకర్తలు, తత్వవేత్తలు సాహిత్యం మరియు సాహితీ విమర్శలో కొత్త విధానాలు రూపొందించారు.
ఆధునిక నవలాకారుల్లో నేను ఆలస్యంగా చదివిన రచయిత Umberto Eco. సంప్రదాయ రచనా శైలికి భిన్నంగా తత్వం, సౌందర్య శాస్త్రం, వేదాంతం, మత గ్రంథాలు, ప్రపంచ సాహిత్యం, తర్కం, శిల్పశాస్త్రం, చిత్రలేఖనం, సంగీతం లాంటి విభిన్న రంగాల్లో అద్భుత అవగాహన, పరిశోధనతో ఆయన రాసిన రెండు రచనలు, The Name of the Rose, Foucault’s Pendulum నవలలు నేను చదివాను. ఈ రెండు రచనలు శత్రు దుర్బేధ్యమైన, అత్యంత జటిలం మరియు క్లిష్టమైన రహస్యాలపై ఆధారపడి నిర్మించబడినవి. Umberto Eco రచనలు ఆయన యొక్క విస్తృత పరిశోధనాసక్తి మరియు పఠనాభిరుచికి నిదర్శనాలు. మధ్యయుగాల్లో యిటలీలోని ఒకానొక క్రైస్తవ ఆశ్రమం (Monastery) లో జరుగుతున్న వరుస హత్యల నిగ్గు తేల్చడానికి యింగ్లాండు నుంచి William విచారకుడు (Inquisitor) రప్పించబడుతాడు. ఆశ్రమంలో అలుముకుంటున్న భయాందోళనలు, అభద్రతను ఆపి ఈ వరుస హత్యల రహస్యాన్ని ఛేదించే పనిలో William సత్యాన్వేషణ మొదలుపెడతాడు. ఈ అన్వేషణ చిత్ర విచిత్ర మలుపులు తిరిగి, చారిత్రక ఘట్టాలతో ముడిపడిన అత్యంత నిగూఢమైన రహస్యానికి దారి తీస్తుంది. The Name of the Rose నవల ఒక అద్భుతమైన నవల. ఆయన వచ్చిన తర్వాత జరిగే మరికొన్ని హత్యలు ఆయనను నిస్సహాయుడిని చేస్తాయి.
ఈ హత్యల రహస్యాన్ని పరిశోధించే క్రమంలో కొన్ని దిగ్బ్రాంతికరమైన విషయాలు వెలుగుచూస్తాయి. గ్రీకు తత్వవేత్త Aristotle రచించిన Poeticsలో Tragedy ప్రపంచానికి సుపరిచితం. కానీ ఆయన వ్రాసిన Comedy అనేది ఉన్నదని, దాని ఒకే ఒక ప్రతి ఆ ఆశ్రమంలోని విలువైన పురాతన గ్రంథాలయంలో కాపాడబడుతున్నదని రచయిత తెలియజేస్తారు. (కల్పన అనుకోండి)ఈ కామెడీ ప్రతి ప్రపంచానికి చేరితే మతం పలుచనవుతుందని, భగవంతుడి పట్ల భక్తుల నమ్మకం సన్నగిల్లుతుందని, అసలు క్రీస్తు జీవితమే వేదనాభరితమైనదని, మనుషులు అందరూ ఈ వేదనను, త్యాగాన్ని స్వీకరించాలని కోరికను, సుఖాన్ని, ఆనందాన్ని, హాస్యాన్ని, త్యజించాలని భావించే వృద్ధ, ఛాందస ప్రభోదకుడి ఆధీనంలో ఉన్న ఈ గ్రంథాన్ని చదవడానికి ప్రయత్నించి, విఫలమై కొందరు ఆశ్రమ విద్యార్ధులు హత్య చేయబడతారు. ఈ హత్యలు జరిగే తీరు అత్యంత భయానకంగా, కిరాతకంగా ఉంటుంది. భగవంతుని కోపం, రౌద్రం (the wrath of God) తెలియచెప్పే విధంగా పంచ భూతాల సాక్షిగా, నీళ్ళలో, అగ్నిలో, గాలిలో వేర్వేరు విధాలుగా ఈ హత్యలు జరుగుతాయి. తర్కం, తత్వం ఉపయోగించి, తన సహేతుకమైన పరిశోధనను William నిర్వహించే తీరు Eco ఈ నవలలో సంక్లిష్టంగా తీర్చిదిద్దారు. తన నవల యొక్క themeగా Aristotle మహనీయుడు రాసిన Poeticsను ఆధారం చేసుకోవడం Eco పరిజ్ఞానానికి, కళాభిమానానికి నిదర్శనం. ప్రముఖ అర్జెంటీనా రచయిత Jorge Luis Borges రచనల పట్ల తనకున్న ఆరాధనా భావాన్ని Eco ఈ నవలలో Aedificium లోని వృద్ధ గ్రంథాలయ అధికారి బ్రదర్ Jorgeకు యివ్వడం ద్వారా చాటుకున్నాడు. Umberto Eco సిద్ధాంతం ప్రకారం, కథలే కథలను చెబుతాయి. Every story belongs to another story. ఈ కధా సమ్మేళనంలో, ఆదికి, అంతానికి, ఆధునికతకు సంకేతమైన quest, తృష్ణకు అర్థంలేదని సూత్రీకరిస్తాడు. యిలాంటి భావమే Orhan Pamuk నవల Black Book లోనూ ధ్వనిస్తుంది. “All texts perpetually refer to other texts, rather than external reality.” ఆధునిక నవలాకారుల్లో, మత గ్రంథాలు (theology)ప్రపంచ సాహిత్యం, తర్కం మరియు వేదాంతం(Philosophy) కాక ఒక స్వయం సిద్ధ జ్ఞాన తృష్ణతో సాహిత్యాన్ని దేదీప్యం చేయడంలో Eco ప్రథమంగా విలసిల్లుతున్నారు. యింతగా తర్కాన్ని, ప్రపంచ సాహిత్యాన్ని, సౌందర్యఆరాధన (aesthetics) ను, nihilistic, existentialist, epicurean, లాంటి వేదాంత ధోరణులతో రంగరించి అపరాధ పరిశోధన చేయించే కథకుడు Orhan Pamuk.
F. R. Leavis ‘The Great English Tradition’ పుస్తకంలో ఆంగ్ల నవలా రచయితల గురించి చర్చించారు. వారిలో D. H. Lawrence గురించి ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. ఆయన రచించిన Rainbow, Sons and Lovers, Women in Love, Lady Chatterley’s Lover రచనలు ఆయన ఆలోచనా విధానాన్ని ప్రకృతి ఆరాధనను, అసహజమైన నాగరిక ప్రక్రియలోని లోపాలను, ప్రకృతిలోని నైర్మల్యాన్ని సూచిస్తున్నాయి. మానవ శరీరం పట్ల ఏవగింపు, లైంగికేచ్ఛపై అసహ్యం లాంటి భావాలు విక్టోరియా సమాజంలో బలంగా ప్రాపకం పొందాయి. అలాంటి భావాలకు విరుద్ధంగా, మత విభేదనతోనూ, వర్గ విభేదాల అవగాహనతోనూ Lawrence తన రచనలు చేశాడు. ఆధునికత, నాగరికతను విమర్శించడానికి, తన భావకవిత్వపు మూలాల నుంచి Lawrence పలు ప్రయత్నాలు చేశాడు. సహజసిద్ధమైన భావాలుగల మగవాడి పతనాన్ని లేదా అపజయాన్ని తెచ్చిపెట్టే ఆధ్యాత్మికత కల్గిన మహిళ అనే యితివృత్తంతో Lawrence రచనలు ఎక్కువగా సాగుతాయి. ఒక్కLady Chatterley’స Lover నవలలో మాత్రమే ఈ వ్యవహారం మారుతుంది.
Lawrence నవలల్లో మహిళలు ప్రముఖంగా కన్పిస్తారు. మహిళకు సహజ సిద్ధమైన ఆకర్షణ, ప్రకృతి తత్వం, సృష్టికి స్పందించడం లాంటి లక్షణాలను Lawrence తన రచనల్లో ఆపాదించాడు. ఈ నాయికలు వెరువరు. వారు నియంత్రణ, సామాజిక కట్టుబాట్లు, పద్ధతులు, నైతిక బోధనల గురించి పట్టింపులు ఉంచుకోరు. Lawrence కోరుకున్నట్లుగా Inner Voice లేదా ఆత్మ, అంతర్గత శక్తి ఏమి కోరుకుంటున్నదో దానికే ప్రతిస్పందిస్తారు. ఈ ఘర్షణలో Lawrence నవలల్లోని మగవారు (నాయకులు) తేలిపోతారు. ఉదా: Rainbow నవలలో Skrenbensky, Lawrence రచనలు భాషాపరంగా గాఢంగా, స్వచ్ఛంగా ఉంటాయి. తమలోని అసహజ, అసంబద్ద, కృత్రిమ భావాలను వడబోసుకుంటూ, నైర్మల్యం, అలౌకిక ఆనందం, ప్రేమ వైపు సాగడానికి Lawrence రచనల్లోని పాత్రలు ప్రయత్నం చేస్తాయి. కొన్ని సందర్భాలలో ఈ ప్రయాణంలో లైంగిక ప్రవృత్తి లేదా విశృంఖులత్వం ద్వారా కూడా విజయం సాధించవచ్చు. Hypocrisy ముసుగు వేసుకున్న సమాజంలాగా Lawrence దీనిని ఏవగించుకోడు.( సశేషం )