Poems Aug 2024

వానలో ఎన్ని కోణాలు

వానలో ఎన్ని కోణాలు
చీకటిలోకి నడుస్తూ
మెత్తగా కురిసిన వాన
రాత్రి వెలుతురు
క్రీనీడల చివర్లో మంతనాలు
ఎంతకు తెగని సంప్రదింపులు
మధ్యలో అరుపులు
కొంచం దూరంగా
పార్కులో ఒంటరి బెంచీలు
ఆగకుండా ఊగి ఆగిపోయిన ఉయ్యాలలు
ఇక టైం అయిపోయింది అని గేట్ వేస్తున్న వాచ్మెన్
వారగా రాత్రి గడిపే దానికి తెచ్చుకున్న పొట్లాలు సీసాలు

మళ్లీ వాన ఈసారి ముద్ద ముద్దగా
ముఖాన్ని అద్దిపోతోంది
జలధారతో మనస్సుని శుద్ధి చేస్తోంది
చెట్టు కొమ్మల లోంచి చిక్కటి బొట్లు
ఆకులమీద అంచులమీద నిలిపే ప్రయత్నం
కాలువ కట్టి జారుతోంది

చెట్ల ప్రక్కన గొడుగు క్రింద చిన్న పిల్లలు
ఆట ఆగిపోయింది
ప్రకృతి పాట మొదలయ్యింది
చినుకు చినుకు మధ్య మెరుపు
కళ్ళను చమక్కు అనిపించి మాయమైతే
ఆధునిక లేసర్ షోని తలపిస్తూ
ఆకాశంలో తారల విలాపాలు

నగరం వానని చూసి వదిలేస్తూ ఉన్నది
వెచ్చటి దుప్పటి లోపల నిద్ర పోతూ వుంది
తెల్లవారితే వాన వదిలేసిన ఛాయ
ప్లాస్టిక్ సీసాలు పాత కాగితాల క్రింద
వాన ఆనవాళ్లు.
An inspiration after T.S.Eliots poem Preludes

Share Your Comments

I would love to hear your thoughts.